
Jair Bolsonaro: దేశం విడిచి పారిపోవాలనుకున్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు!
ఈ వార్తాకథనం ఏంటి
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో (Jair Bolsonaro)పై అక్కడి ఫెడరల్ పోలీసులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అర్జెంటీనా వెళ్లి రాజకీయ ఆశ్రయం పొందే ప్రయత్నం చేశారని విచారణలో బయటపడింది. దీనికి సంబంధించిన మొబైల్ సందేశాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గతంలో పదవిలో కొనసాగేందుకు తిరుగుబాటుకు కుట్ర పన్నారని ఇప్పటికే కేసు నమోదై ఉండగా, ఆ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రావడానికి ఎదురు చూస్తున్న సమయంలో ఈ కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.
వివరాలు
హంగేరీ రాయబార కార్యాలయంలో రెండు రోజుల పాటు తలదాచుకున్న బోల్సొనారో
తిరుగుబాటు కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా ఫెడరల్ పోలీసులు 170 పేజీల విస్తృత నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఇందులో మెసేజింగ్ యాప్ చాట్స్, వాయిస్ మెసేజ్లు, పలు కీలక పత్రాలు ఉన్నాయి. తాజాగా వీటిలోని వివరాలు బహిర్గతమయ్యాయి. బోల్సొనారో అర్జెంటీనా అధ్యక్షుడిని సంప్రదించి అక్కడ రాజకీయ ఆశ్రయం ఇవ్వమని కోరినట్లు పోలీసులు కనుగొన్నారు. తనపై రాజకీయ వేధింపులు జరుగుతున్నాయని, ప్రాణహాని ఉందని ఆయన అప్పట్లో పేర్కొన్నారని సమాచారం. అంతేకాక, అరెస్టు నుంచి తప్పించుకోవడం కోసం బోల్సొనారో ఈ ఏడాది ఫిబ్రవరిలో హంగేరీ రాయబార కార్యాలయంలో రెండు రోజుల పాటు తలదాచుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ఎన్నికల సమయంలో బోల్సొనారో తిరుగుబాటు కుట్రకు రూపకల్పన
తాజా పరిణామాలపై అమెరికాలో నివసిస్తున్న బోల్సొనారో కుమారుడు ఎడ్వర్డో స్పందించారు. బ్రెజిల్‌లో నడుస్తున్న న్యాయ ప్రక్రియలలో తాను జోక్యం చేసుకోవాలన్న ఉద్దేశ్యం లేనని స్పష్టం చేశారు. తండ్రితో తన సంభాషణను బయటపెట్టడం రాజకీయ పక్షపాతం అని ఆయన విమర్శించారు. గతంలో తండ్రితో మాట్లాడినప్పుడు - బాధ్యతగా వ్యవహరించాలని, అలా చేస్తే అమెరికాలో ఎక్కువకాలం ఉండాల్సిన పరిస్థితి రాదని సూచించినట్లు సమాచారం. గత ఎన్నికల సమయంలో బోల్సొనారో తిరుగుబాటు కుట్రకు రూపకల్పన చేశారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆయన, కుమారుడు ఎడ్వర్డో మరో కేసును కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. న్యాయ విచారణను అడ్డుకున్నారన్న ఆరోపణలపై ఫెడరల్ పోలీసులు వారిపై కొత్త కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వెలువడుతున్నాయి.