LOADING...
Bronze Statue of Sushruta: బ్రిటన్‌లో మహర్షి సుశ్రుతుడి కాంస్య విగ్రహావిష్కరణ.. భారత వైద్య వారసత్వానికి అరుదైన గౌరవం
భారత వైద్య వారసత్వానికి అరుదైన గౌరవం

Bronze Statue of Sushruta: బ్రిటన్‌లో మహర్షి సుశ్రుతుడి కాంస్య విగ్రహావిష్కరణ.. భారత వైద్య వారసత్వానికి అరుదైన గౌరవం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 22, 2026
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆధునిక ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడిగా, శస్త్రచికిత్స పితామహుడిగా గుర్తింపు పొందిన మహర్షి సుశ్రుతుడికి బ్రిటన్‌లో అరుదైన గౌరవం లభించింది. ఆయనకు ప్రతిరూపంగా రూపొందించిన 90 కేజీల కాంస్య విగ్రహాన్ని ప్రపంచ ప్రఖ్యాత శస్త్రచికిత్స సంస్థ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్‌బరోలో ఆవిష్కరించారు. 1505లో స్థాపితమైన ఈ సంస్థ ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రముఖ శస్త్రచికిత్స విద్యా కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సంస్థలోని ప్లేఫెయిర్ ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సుశ్రుతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

వివరాలు 

ఈ విగ్రహాన్ని సంస్థకు విరాళంగా అందించిన 'చెరువు ఫ్యామిలీ ఫౌండేషన్'

తెలుగు మూలాలున్న బ్రిటన్‌కు చెందిన ప్రముఖ శస్త్రచికిత్స నిపుణుడు ప్రొఫెసర్ చంద్ర చెరువు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆయన కుటుంబం స్థాపించిన 'చెరువు ఫ్యామిలీ ఫౌండేషన్' ఈ విగ్రహాన్ని సంస్థకు విరాళంగా అందించింది. తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రాంతానికి చెందిన ఓ శిల్పి ఈ కాంస్య విగ్రహాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చంద్ర చెరువు 'మహర్షి సుశ్రుత: ఎ కంపెండియం - ఫాదర్ ఆఫ్ సర్జరీ' పేరుతో 280 పేజీల సమగ్ర గ్రంథాన్ని విడుదల చేశారు. సుశ్రుతుడి వైద్య విజ్ఞానం, శస్త్రచికిత్సా పద్ధతులు, చారిత్రక ఆధారాలు వంటి అంశాలను ఈ పుస్తకంలో విపులంగా వివరించారు.

వివరాలు 

పెరవలి గ్రామంతో అనుబంధం

దివంగత వైద్య నిపుణుడు డాక్టర్ సి.ఎస్. శాస్త్రి కుమారుడైన చంద్ర చెరువు కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి సమీపంలోని పెరవలి గ్రామంతో అనుబంధం ఉంది. ఈ కుటుంబం గత ఆరు శతాబ్దాలకుపైగా గ్రామ ప్రజలకు ఉచిత మూలికా వైద్య సేవలను అందిస్తూ వస్తోంది. అనంతరం వైద్య రంగంలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన చంద్ర చెరువు 1991లో బ్రిటన్‌కు వెళ్లి అక్కడ ప్రముఖ శస్త్రచికిత్స నిపుణుడిగా గుర్తింపు పొందారు.

Advertisement