Australia: ఆస్ట్రేలియాలో భారతీయుడి హత్య కేసులో కర్నాల్‌కు చెందిన ఇద్దరు సోదరులు అరెస్ట్
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో భారతీయ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22ఏళ్ల నవజీత్ సంధూ మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈకేసులో కర్నాల్‌కు చెందిన ఇద్దరు సోదరులను ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో అరెస్టు చేశారు. సమాచారం ప్రకారం,మంగళవారం ఉదయం గౌల్‌బర్న్‌లో సోదాలు చేసి అభిజీత్ (26),రాబిన్ గార్టన్ (27)లను అరెస్టు చేశారు. అద్దె విషయంలో తలెత్తిన వివాదమే మృతికి కారణం కర్నాల్‌లోని గగ్సినా గ్రామానికి చెందిన సంధును ఆదివారం రాత్రి ఛాతీపై కత్తితో పొడిచి హత్య చేశారు. సంధు బంధువు యశ్వీర్ మాట్లాడుతూ, కొంతమంది భారతీయ విద్యార్థుల మధ్య అద్దెకు సంబంధించిన వివాదంలో సంధు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించాడని,దీంతో మరో విద్యార్థి తనపై కత్తితో దాడికి పాల్పడ్డాడని తెలిపారు.
ఛాతీపై కత్తితో దాడి
నవ్‌జీత్‌కు కారు ఉన్నందున అతని స్నేహితుడు (మరొక భారతీయ విద్యార్థి) తన వస్తువులను తీసుకోవడానికి అతని ఇంటికి వెళ్లమని అడిగాడని యశ్వీర్ చెప్పాడు. అతని స్నేహితుడు లోపలికి వెళ్లగా, నవజీత్ అరుపులు విన్నాడు. అక్కడ గొడవ జరగడం గమనించాడు. నవ్‌జీత్ జోక్యం చేసుకోవాలని ప్రయత్నించగా, గొడవ చేయవద్దని కోరడంతో, అతని ఛాతీపై కత్తితో దాడి చేశాడు. నవజీత్ లాగే నిందితుడు కూడా కర్నాల్ వాసి అని తెలిపారు.
భూమిని అమ్మి కొడుకును ఆస్ట్రేలియాలో చదివిస్తున్నాడు
ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటన గురించి కుటుంబ సభ్యులకు సమాచారం అందిందని యశ్వీర్ తెలిపారు. నవజీత్‌తో పాటు ఉన్న తన స్నేహితుడికి కూడా గాయాలయ్యాయి. కుటుంబం షాక్‌కు గురైందని యశ్వీర్ అన్నారు. నవజీత్ తెలివైన విద్యార్థి అని, అతను జూలైలో సెలవులు గడపడానికి తన కుటుంబం వద్దకు వస్తానని చెప్పాడు. యశ్వీర్ తెలిపిన వివరాల ప్రకారం.. నవజీత్ స్టడీ వీసాపై ఏడాదిన్నర క్రితం ఆస్ట్రేలియా వెళ్లాడని, అతని రైతు తండ్రి తన కుమారుడి చదువు కోసం తన భూమిలో ఒకటిన్నర ఎకరాలను విక్రయించాడని తెలిపారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడంలో సహాయం చేయాలని నవజీత్ సంధూ కుటుంబం భారత ప్రభుత్వాన్నికోరింది.