ఖలిస్తానీ హత్య వివాదం.. భారతదేశంలోని కెనడా పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రభుత్వం మంగళవారం భారతదేశంలో నివసిస్తున్న తమ పౌరులను హెచ్చరించింది. ఖలిస్తానీ ఉగ్రవాదిని హతమార్చడంలో "భారత ప్రభుత్వ ఏజెంట్ల" ప్రమేయం ఉందని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత భారత్,కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో తాజాగా కెనడా మరో వివాదాస్పద అంశాన్ని ప్రస్తవించింది. భారతదేశంలో నివసిస్తున్న కెనడియన్ పౌరులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరింది. భారత దేశమంతటా ఉగ్రవాద దాడుల ముప్పు ఉన్నందున ఆ దేశంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రయాణ సలహాను జారీ చేసింది.
భారత్ లో ఆ ప్రాంతాలలో పర్యటించకండి: కెనడా
"అనూహ్యమైన భద్రతా పరిస్థితి" కారణంగా జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, పాకిస్థాన్ సరిహద్దు, పంజాబ్, రాజస్థాన్ , గుజరాత్‌లతో సహా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలల్లో పర్యటించకూడదని ఆ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో ప్రయాణించడం పై ఎటువంటి సూచనలు జారీ చెయ్యలేదు. భారత ప్రభుత్వ ఏజెంట్లు,నిజ్జర్ల హత్యకు మధ్య "సంభావ్య సంబంధము" ఉందన్న జస్టిన్ ట్రూడో వాదనను భారతదేశం పూర్తిగా తిరస్కరించింది. కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ, అంతకుముందు రోజు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధిపతి పవన్ కుమార్ రాయ్‌గా గుర్తించబడిన ఉన్నత స్థాయి భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించారు.
కెమరూన్ మాకే ను తొలగించిన భారత్
ఈ క్రమంలో భారత్ కూడా కెనడియన్ సీనియర్ దౌత్యవేత్త, కెనడియన్ హైకమిషనర్ కెమరూన్ మాకే ను తొలగించింది. కెనడియన్ దౌత్యవేత్తలు మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం,భారత వ్యతిరేక కార్యకలాపాలలో వారి ప్రమేయం గురించి న్యూఢిల్లీలో తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది.