Canada :పన్నూన్ బెదిరింపులపై కెనడా సీరియస్..ఎయిర్ ఇండియాకు భద్రతను పెంచుతామని భారత్'కు హామీ
కెనడాలోని భారత నిషేధిత ఖలీస్థానీ వేర్పాటు వాద సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపులపై ఒట్టొవా సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు భారతదేశం నుంచి వచ్చి పోయే ఎయిర్ ఇండియా విమానాలకు మరింత భద్రత కల్పిస్తామని భారత్'కు హామీ ఇచ్చింది. ఈ విషయంపై తమ బృందాలు దర్యాప్తు జరిపిస్తున్నారని, ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంటోందని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ చెప్పినట్లు కెనడా వెల్లడించింది. దేశంలోని విమానాశ్రయాలతో పాటు ఎయిర్ ఇండియా విమానాలకూ భద్రతను మరింత పెంచినట్లు కెనడా భారతదేశానికి తెలియజేసింది. నవంబర్ 19 తర్వాత ఎయిర్ ఇండియాలో సిక్కులెవరూ ప్రయాణించవద్దని గురుపత్వంత్ పన్నూన్ హెచ్చరించాడు. అందులో ప్రయాణిస్తే మీ జీవితాలు కూడా ప్రమాదంలో పడవచ్చని, రెండుసార్లు నొక్కి మరీ చెప్పారు.
తమ ప్రభుత్వం ఇలాంటివన్నీ తీవ్రంగా పరిగణిస్తుంది : కెనడా
మరోవైపు తాను విమానయాన సంస్థను బహిష్కరించాలని పిలుపునిస్తున్నానని, బెదిరింపులు కాదని గురువారం మరో ప్రకటనలో పన్నూన్ అన్నారు. ఎయిర్ ఇండియా విమానాలకు భద్రత పెంచాలన్న అభ్యర్థనపై కెనడియన్ ప్రభుత్వం స్పందించిందని భారతీయ సీనియర్ అధికారి ఒకరు గురువారం పేర్కొన్నారు. తమ ప్రభుత్వం విమానయానానికి సంబంధించి కలిగే ఏ ముప్పునైనా చాలా తీవ్రంగా పరిగణిస్తుందిని కెనడా రవాణా మంత్రి పాబ్లో రోడ్రిగ్జ్ ప్రతినిధి తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న బెదిరింపు వీడియోలను తమ భద్రతా దళాలు సునిశితంగా గమనిస్తున్నాయన్నారు. పన్నూన్ ప్రకటన తీవ్రమైన నేరపూరితమని ఒట్టావాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ అన్నారు. పన్నూన్ బెదిరింపులు చట్టపరంగా శిక్షార్హమైందని, ఈ మేరకు కెనడా గుర్తించాలని కోరారు.