
Study Permit: కెనడా స్టడీ వీసా.. జీవన వ్యయ నిధులు రూ.1.4 లక్షల మేర పెంపు!
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలో ఉన్నత విద్య కోసం వెళ్లాలని భావిస్తున్న విదేశీ విద్యార్థుల కోసం అక్కడి ప్రభుత్వం కీలక మార్పులను ప్రకటించింది. 2025 సెప్టెంబర్ 1 నుంచి వీసా దరఖాస్తు చేసుకునే వారిపై ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. అయితే, ఇవి క్యూబెక్ రాష్ట్రాన్ని మినహాయించి మిగిలిన అన్ని ప్రావిన్సులకు వర్తిస్తాయి. ఈ మార్పుల్లో ముఖ్యమైనదిగా జీవన వ్యయానికి (Cost of Living) అవసరమైన కనీస నిధుల మొత్తాన్ని కెనడా ప్రభుత్వం దాదాపు 11 శాతం మేర పెంచింది. ఇప్పటివరకు ఏడాదికి 20,635 కెనడియన్ డాలర్లుగా ఉన్న ఈ పరిమితి.. తాజాగా 22,895 డాలర్లకు చేరుకుంది. దీనికి కారణంగా విద్యార్థులు తమ ఖాతాల్లో చూపాల్సిన కనీస నిల్వ కూడా పెరిగిపోనుంది.
Details
6170 డాలర్లకు పెంపు
భారతీయ రూపాయల విలువలో చూస్తే.. ఇప్పటివరకు కనీస నిధులు రూ.13 లక్షల చుట్టూ ఉండగా, ఇప్పుడు ఈ మొత్తం రూ.14.38 లక్షల వరకూ పెరగనుంది. ఇది ట్యూషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులు కాకుండా, నివాసం, ఆహారం, రవాణా వంటి రోజువారీ అవసరాలకు అవసరమైన ఖర్చుల మేరకు నిర్ణయించారు. ఇక కుటుంబంతో కెనడాకు వెళ్లే విదేశీ విద్యార్థులకు, ప్రతీ అదనపు వ్యక్తికి చూపాల్సిన కనీస నిల్వ కూడా పెరిగింది. ఇప్పటివరకు ఒక అదనపు వ్యక్తికి 5599 డాలర్లు చూపించాల్సి ఉండగా, ఇప్పుడు 6170 డాలర్లకు పెంచారు.
Details
ఇమిగ్రేషన్ అధికారులకు చూపించాలి
ఫలితంగా దరఖాస్తుదారుడితో పాటు ఇద్దరు ఉంటే 28,502 డాలర్లు, ముగ్గురు ఉంటే 35,040 డాలర్ల వరకు కనీస నిల్వ అవసరమవుతుంది. కెనడా స్టడీ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో, విద్యార్థులు ట్యూషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులతో పాటు, జీవన ఖర్చులకు సరిపడా నిధులు తమ ఖాతాల్లో ఉన్నాయని తగిన ఆధారాలతో ఇమిగ్రేషన్ అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఈ మార్పులతో విద్యార్థుల ఆర్థిక ప్రణాళికలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.