Page Loader
Canada: కెనడాలోని రెండు ప్రావిన్స్‌ల్లో భీకర కార్చిచ్చు.. వేలమంది తరలింపు..! 
కెనడాలోని రెండు ప్రావిన్స్‌ల్లో భీకర కార్చిచ్చు.. వేలమంది తరలింపు..!

Canada: కెనడాలోని రెండు ప్రావిన్స్‌ల్లో భీకర కార్చిచ్చు.. వేలమంది తరలింపు..! 

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2025
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడా పశ్చిమ భాగంలో ఉన్న సస్కట్చివాన్‌ ప్రావిన్స్‌లో కార్చిచ్చు తీవ్రంగా వ్యాపించింది. దాంతో అక్కడ అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.ఈ కార్చిచ్చు ప్రభావం ఇప్పటికే పక్కనున్న మాంటోబా ప్రావిన్స్‌ వరకూ విస్తరించింది. మాంటోబాలో పరిస్థితి అదుపుతప్పడంతో దాదాపు 17,000 మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సస్కట్చివాన్‌ ప్రీమియర్‌ స్కాట్ మో మాట్లాడుతూ,తమ ప్రావిన్స్‌ అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటోందని తెలిపారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ప్రాంతం నుంచి సుమారు 4,000 మందిని తరలించినట్లు సమాచారం. కార్చిచ్చు ప్రామాదకరంగా వ్యాపించి సుమారు 6,69,000 ఎకరాల మేర విస్తరించింది.

వివరాలు 

రంగంలోకి కెనడా వైమానిక దళం

ఈ పరిస్థితి తక్షణంలో చల్లబడే అవకాశమే లేదని,రాబోయే రోజుల్లో మరింత క్లిష్టంగా మారవచ్చని అక్కడి సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఇక బుధవారం రోజున మాంటోబా ప్రావిన్స్‌లో కూడా అత్యవసర పరిస్థితిని అధికారికంగా ప్రకటించారు. చిన్నచిన్న గ్రామాలు,పట్టణాలు ఖాళీ చేయించాల్సిన స్థితి ఏర్పడింది.ఇలాంటి స్థాయిలో కార్చిచ్చు గతంలో ఎప్పుడూ చూడలేదని అధికారులు చెబుతున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కెనడా వైమానిక దళం కూడా రంగంలోకి దిగింది. ఇప్పటివరకు మాంటోబాలో సుమారు 1,73,000ఎకరాల భూమి కాలిపోయింది. కార్చిచ్చును నియంత్రించేందుకు వర్షం అనివార్యమని భావిస్తున్నారు.రెండు లేదా మూడు రోజులు వర్షం పడితే తప్ప ఇది అదుపులోకి రానని అంచనా వేస్తున్నారు. ఈకార్చిచ్చు కారణంగా ఏర్పడుతున్న ఘనమైన పొగ కణాలు అమెరికాలోని మిన్నెసోటా,మిషిగన్‌ వంటి రాష్ట్రాల వైపు ప్రవహిస్తున్నాయి.

వివరాలు 

15 లక్షల ఎకరాల భూభాగం అగ్నికి ఆహుతి 

కేవలం ఈ రెండు ప్రావిన్స్‌లలోనే 2025లో దాదాపు 15 లక్షల ఎకరాల భూభాగం అగ్నికి ఆహుతైనట్లు లెక్కలు చెబుతున్నాయి. కెనడా సహజ వనరుల శాఖ తాజా నివేదిక ప్రకారం, 2025లో దేశవ్యాప్తంగా మొత్తం 6,000 కార్చిచ్చు సంఘటనలు సంభవించాయి. వీటి ద్వారా సుమారు 3.7 కోట్ల ఎకరాల భూమి పూర్తిగా కాలిపోయిందని పేర్కొన్నారు. ఈ కార్చిచ్చుల ప్రభావం కేవలం కెనడాలోనే కాదు.. అమెరికా దేశాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. అమెరికన్ లంగ్ అసోసియేషన్ 2025లో విడుదల చేసిన 'స్టేట్ ఆఫ్ ది ఎయిర్' రిపోర్టు ప్రకారం, కెనడాలో చోటుచేసుకుంటున్న కార్చిచ్చుల వల్ల అమెరికాలోని ప్రజలు శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది.