Page Loader
అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో నీటి శబ్ధాలను గుర్తించిన కెనడా విమానం
నీటి శబ్దాలను గుర్తించిన కెనడా విమానం

అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో నీటి శబ్ధాలను గుర్తించిన కెనడా విమానం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 21, 2023
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన మినీ జలాంతర్గామి వద్ద నీటి శబ్దాలను కెనడా నిఘా విమానం గుర్తించింది. ఈ మేరకు గాలింపు ప్రక్రియలో స్వల్ప పురోగతి లభించింది. అట్లాంటిక్‌ మహ సముద్రంలో నీటి అడుగున శబ్దాలను పీ-8 నిఘా విమానం పసిగట్టింది. ఈ మేరకు అమెరికా కోస్ట్‌గార్డ్‌లోని నార్త్‌ఈస్ట్‌ కమాండ్‌ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీ మెమోను ఆ దేశ మీడియా ఉటంకించింది. కెనడా విమానం ఒకటి, సముద్రంలోని శబ్దాలను గుర్తించినట్టు అమెరికాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి.

DETAILS

3 రోజులుగా ముమ్ముర గాలింపు చర్యలు 

సముద్ర గర్భంలో ప్రతి 30 నిమిషాలకోసారి నీటి చప్పుళ్లు వినిపిస్తున్న విషయాన్ని కెనడా విమానం గుర్తించిందని అమెరికా హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. దాదాపు 4 గంటల పాటు ఈ శబ్దాలను గమనించిందని తెలిపింది. 3 రోజులుగా గాలింపు చర్యలు ముమ్మురంగా సాగుతున్న క్రమంలో లభించిన తొలి పురోగతి ఇదే. ఈ నేపథ్యంలో అమెరికా గాలింపు బృందాలు, అదనపు నౌకలు, పరికరాలను ఘటనా స్థలికి యుద్ధ ప్రాతిపదికన తరలిస్తోంది. అయితే తర్వాత జరిపిన అదనపు గాలింపు ప్రక్రియలో మళ్లీ శబ్దాలను అందుకోలేకపోయామని నార్త్‌ ఈస్ట్‌ కమాండ్‌ చెప్పడం గమనార్హం. అయినప్పటికీ అక్కడే గాలింపు చర్యలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు గాలించేందుకు డీప్‌సీ కంపెనీ ఎక్స్‌ప్లోరర్స్‌ క్లబ్‌ కు అనుమతి లభించింది.