టైటానిక్ శిథిలాలు చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ జలాంతర్గామి గల్లంతు
దాదాపు వందేళ్ల కిందట సముద్రంలో మునిగిన టైటానిక్ షిప్ ను చూసేందుకు వెళ్లిన ఓ సబ్ మెరైన్ అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైంది. ఘటన సమయంలో జలాంతర్గామిలో ముగ్గురు టూరిస్టులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది. సబ్ మెరైన్ తో సమాచార వ్యవస్థ సంబంధాలు తెగిపోయిన విషయాన్ని గుర్తించిన అనంతరం ముమ్ముర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు అమెరికా,కెనడాలకు చెందిన తీర ప్రాంత రక్షక దళాలు సహా నేవీ సబ్ మెరైన్ లు సహాయ కార్యక్రమాలు చేపట్టింది. అయితే జలాంతర్గామికి సంబంధించిన వివరాలపై టూరిస్ట్ కంపెనీ ఓషియన్ గేట్ మౌనం వహించింది. సబ్ మెరైన్ ఎప్పుడు గల్లంతైంది, ఆ సమయంలో అందులో ఎంత మంది పర్యటకులు ఉన్నారనే వివరాలను అధికారికంగా ప్రకటించలేదు.
ఈ టూర్ కోసం ఓషియన్ గేట్ ఒక్కొక్కరి నుంచి రుసుం వసూలు
అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే పర్యటక సంస్థ ఈ టూర్లను చేపడుతోంది. ఇందుకోసం స్పెషల్ గా చిన్నపాటి జలాంతర్గామిని కొనుగోలు చేసింది. దానికి టైటాన్ అని నామకరణం చేసింది. 1912లో అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను దగ్గర్నుంచి చూపించేందుకు ఈ జలాంతర్గామిని వాడుతోంది. ఇందులో ముగ్గురు అతిథులు, ఓ పైలట్, మరో నిపుణుడు, మొత్తంగా ఐదుగురు ప్రయాణించేందుకు అనువుగా ఉంటుంది. అయితే సుమారు 4 రోజులకు సరిపడా ప్రాణవాయువును సబ్ మెరైన్ లో నింపుతారు. రోజుకు 8 గంటలు సముద్ర గర్భంలో చక్కర్లు కొడుతూ, టైటానిక్ శిథిలాలను చూపిస్తారు. ఈ టూర్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 2,50,000 డాలర్లను రుసుంగా నిర్ణయించింది.