Netanyahu: అమల్లో కాల్పుల విరమణ ఒప్పందం.. కానీ యుద్ధం చేసే హక్కు మాకు ఉంది : నెతన్యాహు
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని పునఃప్రారంభించే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు.
విడుదల చేయనున్న బందీల జాబితాను తాము స్వీకరించే వరకు ఒప్పందం అమలు సాధ్యం కాదని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఒప్పందాన్ని ఉల్లంఘించినా ఇజ్రాయెల్ సహించదని, హమాస్ మాత్రమే పూర్తి బాధ్యత వహించాలని ఎక్స్ వేదికగా తెలిపారు. అమెరికా మద్దతుతో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే హక్కు తమకు ఉందని నెతన్యాహు పేర్కొన్నారు.
15 నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధంతో గాజా అట్టుడికింది. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
Details
ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆమోదం
ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి అమలులోకి వచ్చిన ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఒప్పందం మూడు దశల్లో అమలు అవుతుంది.
తొలి దశలో 42 రోజులు తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగనుంది. హమాస్ తమ చెరలో ఉన్న 33 మంది బందీలను విడుదల చేస్తుంది. దీనికి ప్రతిగా, ఇజ్రాయెల్ 737 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది.
అక్టోబర్ 7న హమాస్ దాడులతో సంబంధం లేని 1,167 మంది గాజా వాసులకు కూడా స్వేచ్ఛ లభిస్తుంది.
రెండో దశలో మిగిలిన బందీలను హమాస్ విడుదల చేస్తుంది. అయితే ఈ దశను శాశ్వత కాల్పుల విరమణగా మార్చడానికి ఇజ్రాయెల్ అంగీకరించాల్సి ఉంటుంది.