Russia-Ukraine War: రష్యాతో కాల్పుల విరమణ.. భారత ప్రతిపాదనపై ఉక్రెయిన్ ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు కాల్పుల విరమణకు సంబంధించి భారత్ చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ ప్రశంసించింది. తమకు అందిన నాలుగు కాల్పుల విరమణ ప్రతిపాదనల్లో భారత్ సూచించిన ప్రతిపాదన అత్యంత విస్తృతమైనదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా పేర్కొన్నారు. కాల్పుల విరమణకు సంబంధించి భారత్ చేసిన ప్రతిపాదనలో పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపివేయడంతోపాటు నల్ల సముద్రంలో పరిస్థితులను మెరుగుపరచడం వంటి అంశాల ఆధారంగా కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని సిబిహా వెల్లడించారు. కీవ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు యూరోపియన్ పత్రిక ప్రావ్దా తెలిపింది.
వివరాలు
నాలుగు ప్రతిపాదనలు అందాయి
మాకు నాలుగు ప్రతిపాదనలు అందాయి. వాటిలో భారత్ చేసిన ప్రతిపాదన అత్యంత విస్తృతమైనది'' అని ఆండ్రీ సిబిహా పేర్కొన్నట్లు ప్రావ్దా వెల్లడించింది.
ఐదో సంవత్సరంలోకి ప్రవేశించిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఈ నేపథ్యంలో యుద్ధానికి పరిష్కారం కనుగొనేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఈ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉక్రెయిన్‌తో వివాద పరిష్కారానికి సంబంధించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలు కలిగి ఉన్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్న నేపథ్యంలో ఆండ్రీ సిబిహా చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వివరాలు
కాల్పుల ఒప్పందం కుదిరితే మేము అంగీకరిస్తాం
తమకు భారత్‌తోపాటు తుర్కియే, ఈజిప్టు, అమెరికా దేశాల నుంచి కాల్పుల విరమణ ప్రతిపాదనలు అందాయని సిబిహా తెలిపారు.
యుద్ధరంగంలో పోరాటాన్ని నిలిపివేయడంతోపాటు ఇంధన వనరులు, రేవులపై దాడులను ఆపడం, నల్ల సముద్రంలో పరిస్థితులను మెరుగుపరచడం వంటి అంశాలు కాల్పుల విరమణ ఒప్పందంలో ఉండాలని ఉక్రెయిన్ కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితేనే తాము అంగీకరిస్తామని ఆండ్రీ సిబిహా తేల్చి చెప్పారు.