
Kharge: బిహార్ ఎన్నికల్లోనూ ఓటు దోపిడీకి కేంద్రం-ఈసీ కుట్ర : ఖర్గే సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల కమిషన్(EC)పై ఘాటుగా విరుచుకుపడ్డారు. పదేళ్లుగా ఈసీ ఓటు చోరీ చేస్తున్న వారిని కపాడుతూ, కీలకమైన సమాచారాన్ని దాచిపెడుతోందని తీవ్ర విమర్శలు చేశారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటరు జాబితాలో నుండి వేలాది ఓటర్ల పేర్లను తొలగించడానికి జరిగిన యత్నానికి సంబంధించిన ముఖ్యమైన డేటాను ఈసీ ఇప్పటికీ బయటపెట్టలేదని ఆయన మండిపడ్డారు. మే 2023లో అలంద్ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించే కుట్రను కాంగ్రెస్ బయటపెట్టిందని ఖర్గే గుర్తుచేశారు.ఈ చర్యలతో అనేకమంది తమ ఓటు హక్కును కోల్పోయారని పేర్కొన్నారు. ఓటర్లను మోసం చేయడానికి జరిగిన పెద్ద కుట్రకు సాక్ష్యాలు ఉన్నప్పటికీ, ఆ వివరాలను ఎన్నికల కమిషన్ దాచిపెట్టిందని, ఓటు చోరీ వెనక ఉన్నవారిని రక్షించిందని ఆరోపించారు.
Details
దోపిడీ ద్వారా గెలుపొందేందుకు ప్రయత్నాలు
పదేళ్లుగా ఇదే పద్ధతిలో ఈసీ పని చేస్తోందని, చట్టాలను మార్చి కూడా ఓటు దొంగలకు మద్దతు ఇస్తోందని అన్నారు. ఇలాంటి ప్రయత్నాలే ఇప్పుడు బిహార్‌లోనూ జరుగుతున్నాయని ఖర్గే ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఓటు దోపిడీ ద్వారా గెలుపొందేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్డీయే ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడిందని, అయితే బిహార్‌లో మాత్రం కాంగ్రెస్-మిత్రపక్షాలు బీజేపీ, ఈసీకి ఒక్క ఓటు కూడా దొంగిలించనివ్వరని ఖర్గే స్పష్టం చేశారు. త్వరలోనే ఎన్డీయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన అంచనా వేశారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా బిహార్‌లో చేపట్టిన 'ఓటర్ అధికార్ యాత్ర' దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారుతుందని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు.