
Cancer: రష్యా సంచలన ఆవిష్కరణ.. క్యాన్సర్‌కు 'ఎంటెరోమిక్స్' వ్యాక్సిన్ సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా వైద్య రంగంలో మరో సంచలనాన్ని సృష్టించింది. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధికి చికిత్సగా 'ఎంటెరోమిక్స్' అనే అత్యాధునిక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ప్రయోగశాల స్థాయిలో చేసిన తొలి పరీక్షల్లో ఇది వంద శాతం ప్రభావవంతంగా పనిచేసినట్టు వెల్లడైంది. ఈ శుభవార్తతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు కలుగుతున్నాయి. ఇప్పటికే 'స్పుత్నిక్ వి' కొవిడ్ వ్యాక్సిన్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మాస్కోలోని గామాలెయా సెంటర్ నే ఈ 'ఎంటెరోమిక్స్' వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేసింది. ఇది ఒక రకమైన 'mRNA ఆధారిత థెరపీ'. ప్రతి రోగి కణితి కణాల జన్యువుల ఆధారంగా వ్యక్తిగతంగా ఈ వ్యాక్సిన్ తయారవుతుంది.
Details
ట్రయల్స్ దశలో వ్యాక్సిన్
దీని ప్రత్యేకత ఏమిటంటే.. వ్యాక్సిన్ నేరుగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. ఇవి విజయవంతమైతే క్యాన్సర్ చికిత్సలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రాథమిక ఫలితాలు అత్యంత ఆశాజనకంగా ఉండటంతో రష్యా ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను తమ పౌరులకు ఉచితంగా అందించే ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం. మరోవైపు అమెరికాకు చెందిన మోడెర్నా, బయోఎన్‌టెక్ వంటి ఫార్మా సంస్థలు కూడా mRNA ఆధారిత క్యాన్సర్ థెరపీలపై పరిశోధనలు చేస్తున్నప్పటికీ, రష్యా 'ఎంటెరోమిక్స్'తో ఈ పోటీలో ముందంజలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Details
క్యాన్సర్ తో పోరాడుతున్న లక్షలాదిమందిలో ఓ కొత్త ఆశ
ఇది కేవలం ఒక వైద్య ఆవిష్కరణ మాత్రమే కాకుండా, ప్రపంచ ఆరోగ్య రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న లక్షలాది మందికి ఈ వ్యాక్సిన్ ఒక కొత్త ఆశగా నిలుస్తోంది. రాబోయే క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే.. క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయడం లేదా కనీసం దీర్ఘకాలిక వ్యాధిగా మార్చడం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.