LOADING...
India-US: భారత్‌పై మళ్లీ ఆరోపణలు చేసిన నవారో.. వాస్తవాలు బయటపెట్టిన 'ఎక్స్'!
భారత్‌పై మళ్లీ ఆరోపణలు చేసిన నవారో.. వాస్తవాలు బయటపెట్టిన 'ఎక్స్'!

India-US: భారత్‌పై మళ్లీ ఆరోపణలు చేసిన నవారో.. వాస్తవాలు బయటపెట్టిన 'ఎక్స్'!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2025
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాతో భారత్‌ కొనసాగిస్తున్న సంబంధాలపై డొనాల్డ్ ట్రంప్‌ మాజీ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో (Peter Navarro) పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆయన ఆరోపణలు వాస్తవం కాదని 'ఎక్స్' (X) ప్లాట్‌ఫామ్ ఫ్యాక్ట్‌ చెక్‌ చేసి కొట్టిపారేసింది. అయినప్పటికీ, నవారో తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. నవారో చేసిన ఆరోపణల్లో భారత్‌ అత్యధిక సుంకాలు విధించడం వల్ల అమెరికా ఉద్యోగాలు కోల్పోతున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి లాభం పొందుతూ, మాస్కో ఉక్రెయిన్‌ యుద్ధాన్ని కొనసాగించేందుకు తోడ్పడుతోంది. ఆ యుద్ధంలో నిరపరాధ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారుని పేర్కొన్నారు. దీనిపై 'ఎక్స్' ఫ్యాక్ట్‌ చెక్‌ చేస్తూ, నవారో వ్యాఖ్యలను ''కపటమైనవి'' అని తిప్పికొట్టింది.

Details

భారత్ చర్యలే కారణం

భారత్‌ చమురు కొనుగోలు ఇంధన భద్రత కోసమేనని, ఎలాంటి ఆంక్షల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా అమెరికా కూడా రష్యా నుంచి పలు వస్తువులు దిగుమతి చేసుకుంటోందని గుర్తుచేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నవారో, 'ఎక్స్' అధినేత ఎలాన్‌ మస్క్‌పై విరుచుకుపడి, ఫ్యాక్ట్‌ చెక్‌ను 'చెత్త'గా అభివర్ణించారు. అయినప్పటికీ ఆయన తన ఆరోపణలకే కట్టుబడి, 'ఉక్రెయిన్‌ యుద్ధం మొదలుకాకముందు భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయలేదు. ఉక్రెయిన్‌ ప్రజల మరణాలు, అమెరికన్ల ఉద్యోగ నష్టానికి భారత్‌ చర్యలే కారణమని వాదించారు. ఈ వాదనలపై కూడా 'ఎక్స్' మరోసారి ఫ్యాక్ట్‌ చెక్‌ చేస్తూ, భారత్‌ స్వతంత్ర నిర్ణయంగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందని, అది చట్టబద్ధమేనని తెలిపింది.

Details

ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం

అమెరికా మాత్రం రష్యా నుంచి యురేనియం వంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోందని, ఇది యూఎస్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని స్పష్టం చేసింది. ఇక వాణిజ్య రంగంలోనూ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించడం వల్ల సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ చర్యను అమెరికా విశ్లేషకులు విమర్శించినా, పీటర్‌ నవారో, బెసెంట్‌ వంటి నాయకులు మాత్రం భారత్‌ను లక్ష్యంగా చేసుకుని కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల నవారో చేసిన ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండిస్తూ, అవి 'తప్పుదారి పట్టించే వ్యాఖ్యలని అభివర్ణించింది.