China: ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను నిర్బంధించిన చైనా.. అదుపులో ముగ్గురు
చైనాలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లపై నియంత్రణ వేస్తున్న జిన్‌పింగ్ సర్కారు తాజాగా మూడు ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను బీజింగ్ అధికారులు ఆగస్టులో అరెస్ట్ చేశారని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ఈ వ్యవహారం ఆ రంగంలో కలకలం రేపుతోంది. ఈ ముగ్గురు బ్యాంకర్లలో ఒకరు, ప్రభుత్వ రంగ హైటాంగ్ సెక్యూరిటీస్‌కు చెందినవారు, విదేశాలకు పారిపోయారు. ఆయనను విదేశాల్లో పట్టుకుని చైనాకు తీసుకొచ్చినట్లు సమాచారం. గత ఏడాది చైనాలో ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ బావో ఫాన్ అదృశ్యమయ్యారు. అతడిని ఒక కేసు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల బంధించబడ్డ వారిలో షెన్‌వాన్ హాంగ్‌యూవాన్ గ్రూప్ జనరల్ మేనేజర్ వాంగ్‌ఝోపింగ్, గ్యూవాన్ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ విభాగం అధిపతి వాంగ్ చెన్ ఉన్నారు.
ఉద్యోగం నుండి రాజీనామా చేసేందుకు కూడా అనుమతి
హైటాంగ్ సెక్యూరిటీస్ సహా అనేక బ్రోకరేజీ సంస్థలు తమ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లకు పాస్‌పోర్టులు సమర్పించాలని కోరినట్లు తెలుస్తోంది. వారు వ్యక్తిగత, వృత్తిపరమైన విదేశీ పర్యటనలకు అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. చివరికి, ఉద్యోగం నుండి రాజీనామా చేసేందుకు కూడా అనుమతి అవసరం అని సూచించారు. ఈ బ్యాంకర్లు విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు, సంస్థల సిబ్బంది వారితో కలిసి ఉంటారని, ముందుగా నిర్ణయించిన ప్రదేశాల్లోనే వీరు తమ కార్యకలాపాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాలు చైనాలో నియంత్రణ సంస్థల నుంచి ప్రైవేట్‌గా వచ్చిన ఆదేశాల ఆధారంగా తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం సంస్థల ఐపీవోలు, నిధుల సేకరణ కార్యక్రమాలను బాగా పరిశీలిస్తోందని, అవసరమైతే బ్యాంకర్లను ప్రశ్నించేందుకు పిలుస్తుందని కొన్ని సంస్థలు తెలియజేశాయి.
దేశీయ మార్కెట్ కార్యకలాపాల విలువ 1.7 ట్రిలియన్ డాలర్లు
గతంలో, ప్రభుత్వ రంగ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, కమ్యూనిస్టు పార్టీ అధికారులు మాత్రమే పాస్‌పోర్టులను సమర్పించేవారు. చైనాలో బ్రోకరేజీ పరిశ్రమ, దేశీయ మార్కెట్ కార్యకలాపాల విలువ 1.7 ట్రిలియన్ డాలర్లు గా అంచనా. ఈ సారి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫైనాన్షియల్ రంగంలోని ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని ప్రభావితం చేస్తాయని, బీజింగ్ లోని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ డైరెక్టర్ ఛాన్సన్ అండ్ కో పేర్కొంది. ప్రస్తుతం 147 ప్రముఖ బ్రోకరేజీ సంస్థల్లో 8,700 ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు పనిచేస్తున్నారు. వీరు ఐపీవోలు, షేర్ల విక్రయాల వంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.