
China: చైనా కీలక సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ అరెస్ట్..?
ఈ వార్తాకథనం ఏంటి
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితంగా భావించే ఫుజియాన్ ప్రాంతానికి చెందిన సైనిక నేతలు, ఉన్నతాధికారులపై కఠిన చర్యలు మొదలయ్యాయి.
చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ హి వైడాంగ్‌ను అరెస్ట్ చేశారు.
ఈ కమిషన్‌కు అధ్యక్షుడు జిన్‌పింగ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల చైనాలో కీలక పదవుల్లో మార్పులు జరుగుతుండగా, తాజా అరెస్టులు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)లో అత్యున్నత స్థాయిలో ఉన్న సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ హోదాలో ఉన్న హి వైడాంగ్ అరెస్టుతో మరిన్ని కీలక మార్పులు సంభవించే అవకాశముంది.
ఆయనతో పాటు పీఎల్‌ఏ జనరల్ లాజిస్టిక్స్ డిపార్ట్‌మెంట్‌కు మాజీ మంత్రిగా ఉన్న ఝావో కేషిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వివరాలు
ఝావో కేషి అరెస్టుకు గల ముఖ్య కారణాలు
ఝావో కేషి అరెస్ట్ కూడా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
నాన్‌జింగ్ మిలిటరీ రీజియన్‌లో జనరల్ లాజిస్టిక్స్ విభాగాన్ని నడిపిన ఆయన, సైనిక బడ్జెట్ కేటాయింపులు, రక్షణ రంగ వనరుల పంపిణీ వంటి కీలక అంశాల్లో ప్రధాన పాత్ర పోషించారు.
హి వైడాంగ్ సెక్రటరీపై కూడా అత్యంత రహస్యమైన సైనిక సమాచారం లీక్ చేశారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.
ఇక వెస్టర్న్ థియేటర్ కమాండ్‌లోని డిప్యూటీ కమాండర్‌తో పాటు ఫుజియాన్‌లో కీలక పదవుల్లో ఉన్న పలువురు జనరల్స్‌ను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.
వివరాలు
నేవీ, సైనిక కమాండుల పునర్వ్యవస్థీకరణ
తూర్పు థియేటర్ కమాండర్‌తో పాటు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం డిప్యూటీ డైరెక్టర్, మిలిటరీ అఫైర్స్ విభాగానికి చెందిన డైరెక్టర్ వంటి కీలక స్థాయిల్లోనూ మార్పులు జరిగాయి. దీనిపై చైనా రక్షణ శాఖ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.
వివరాలు
జిన్‌పింగ్‌కు సన్నిహితమైన ఫుజియాన్ ఫ్యాక్షన్‌పై ఎదురుదాడి?
ఫుజియాన్ ప్రాంతానికి చెందిన మరికొందరు సీనియర్ జనరల్స్‌ను కూడా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫ్యాక్షన్ అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత దగ్గరగా ఉన్నట్లు భావిస్తారు.అయితే,జిన్‌పింగ్ స్వయంగా తనకు సమీపంగా ఉన్న వారిని తొలగిస్తున్నారా? లేక తన పాలనకు వ్యతిరేకంగా సైన్యంలో పెరుగుతున్న నిరసన ధోరణిని అణిచివేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారా? అనేది స్పష్టత రావాల్సిన అంశంగా ఉంది.
గతేడాది కూడా చైనాలో ఉన్నతస్థాయి సైనిక అధికారి మియావో లిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆయన అప్పట్లో పొలిటికల్ వర్క్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు.అంతకు ముందు చైనా రక్షణ మంత్రిని కూడా అరెస్ట్ చేశారు.
తాజా పరిణామాలతో చైనా సైనిక వ్యవస్థలో పెరుగుతున్న అప్రసన్నత మరోసారి హైలైట్ అవుతోంది.