Page Loader
Xi Jinping: "మమ్మల్ని ఎవరూ ఆపలేరు..."జి జిన్‌పింగ్ హెచ్చరిక
"మమ్మల్ని ఎవరూ ఆపలేరు..."జి జిన్‌పింగ్ హెచ్చరిక

Xi Jinping: "మమ్మల్ని ఎవరూ ఆపలేరు..."జి జిన్‌పింగ్ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2025
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తైవాన్‌ను చైనాలో కలిపే ప్రక్రియను ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. తైవాన్‌ చైనాలో విడదీయరాని భాగమని, ఈ అంశంలో ఏ ఒక్కరూ అభ్యంతరం చెప్పలేరని పేర్కొన్నారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న చైనా ప్రజలు ఒకే కుటుంబమని, వారి రక్త సంబంధాలు ఎప్పటికీ విడదీయలేవని ఆయన పునరుద్ఘాటించారు. తైవాన్ చుట్టూ వైమానిక, నౌకాదళ విన్యాసాలను కొనసాగించడం కూడా ఈ సంకల్పానికి నిదర్శనమని తెలిపారు. ఇప్పటికే చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న వేళ, జిన్‌పింగ్‌ వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తతకు గురిచేస్తున్నాయి.

వివరాలు 

అంతర్జాతీయంగా తైవాన్‌కు సంబంధాలు లేకుండా ఉండేందుకు చైనా ప్రయత్నాలు

గత కొద్ది కాలంగా చైనా తరచూ తైవాన్‌పై తన అంగీకారాన్ని చాటుతోంది. తైవాన్ ప్రజాస్వామ్య దేశంగా ఉండగా, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నది. బీజింగ్ తైవాన్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. అంతర్జాతీయంగా తైవాన్‌కు సంబంధాలు లేకుండా ఉండేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. తైవాన్ అధ్యక్షుడిగా లాయ్‌ చింగ్‌ ఎన్నికైన తర్వాత చైనా మిలటరీ కార్యకలాపాలు మరింతగా పెంచింది. ప్రాదేశిక జలాల్లో మూడుసార్లు భారీ సైనిక విన్యాసాలు చేపట్టిన చైనా, తైవాన్‌ను బలప్రయోగంతో తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.

వివరాలు 

అమెరికా ఆసియాలో వ్యూహాత్మక మిత్రదేశంగా  తైవాన్‌

ఇక అమెరికా తైవాన్‌ను ఆసియాలో వ్యూహాత్మక మిత్రదేశంగా చూస్తోంది. తైవాన్‌కు ఆయుధాలను సరఫరా చేయడంలో అమెరికా కీలక పాత్ర పోషిస్తోంది. తైవాన్‌ను రక్షించడంలో అమెరికా ఎప్పుడూ అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో, కొత్తగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే వేళ జిన్‌పింగ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.