China: చైనా 996 వర్క్ కల్చర్ ఏమిటి? అబ్బాయిలు,అమ్మాయిలు ఎందుకు పక్షుల్లా ప్రవర్తిస్తున్నారు?
ఈ రోజుల్లో '996' వర్క్ కల్చర్ సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో చైనా అబ్బాయిలు, అమ్మాయిలు దీనికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. చైనా యువకులు చైనీస్ వర్క్ కల్చర్‌కు వ్యతిరేకంగా పక్షుల్లా వేషాలు వేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పటి నుండి, చైనాలో '996' వర్క్ కల్చర్ లేదా ఆఫీస్ కల్చర్ గురించి అలజడి మొదలైంది. కానీ, ఈ '996' వర్క్ కల్చర్ ఏంటో, ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలుసా..
చైనా '996' వర్క్ కల్చర్ ఏమిటి?
చైనాలోని ప్రైవేట్ కంపెనీలలో, ముఖ్యంగా టెక్ పరిశ్రమలో '996' ఈ వర్క్ కల్చర్ ప్రబలంగా ఉంది. దీని ప్రకారం, ఉద్యోగులు వారానికి 6 రోజులు ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు పని చేయాలి. ఈ వర్క్ కల్చర్ ని చైనాలో చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు, అయితే చైనాలోని ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులపై దోపిడీకి పాల్పడుతున్నట్లు అనేక సార్లు నివేదికలు వచ్చాయి. ఈ కంపెనీలు ఉద్యోగులకు వారానికి ఒక్కరోజు మాత్రమే సెలవు ఇచ్చి రోజూ 12-12 గంటలు పని చేసేలా చేస్తాయి.
వర్క్ కల్చర్ కి వ్యతిరేకంగా పక్షిలా వీడియోలు
'996' వర్క్ కల్చర్‌కు వ్యతిరేకంగా చైనా అబ్బాయిలు, అమ్మాయిలు పక్షులుగా వీడియోలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, యువకులు భారీ టీ-షర్టులు ధరించి, వారి చేతులు, కాళ్ళను సరిగ్గా పక్షుల మాదిరిగానే దాచుకుంటారు. దీని తరువాత, వారు ఫర్నిచర్ మీద కూర్చొని, రెక్కలు విప్పుతూ, కిచకిచలాడుతూ కనిపిస్తారు. ఈ వీడియోలు టిక్‌టాక్ వంటి వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలకు యువతకు కూడా విపరీతమైన మద్దతు లభిస్తోంది. అయితే, చైనా యువత తమ దేశంలోని '996' పని సంస్కృతిపై సోషల్ మీడియాలో తమ నిరాశను వ్యక్తం చేయడం ఇది మొదటిసారేమి కాదు. 2022 సంవత్సరంలో, 'బాయి లాన్' (కుళ్ళిపోనివ్వండి) అనే పదం విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభమైంది.
చైనాలో 8 గంటలు మాత్రమే పని చేయాలనే చట్టం
2021 సంవత్సరంలో, '996'కి వ్యతిరేకంగా 'వర్కర్ లైవ్స్ మేటర్' అనే ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే ఈ రకమైన దోపిడీ తర్వాత కూడా చైనా ప్రజలు వారానికి 72 గంటలు పని చేయవలసి వస్తోంది. చైనా ప్రభుత్వం పనికి సంబంధించి ఒక చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం కంపెనీలు తమ ఉద్యోగులను వారంలో గరిష్టంగా 44 గంటలు మాత్రమే పని చేయించాలి. కానీ, దీని తర్వాత కూడా ఓవర్ టైం పేరుతో కంపెనీలు తమ ఉద్యోగులను 12-12 గంటల పాటు పని చేసేలా చేస్తాయి. ఈ విషయమై చైనా ప్రభుత్వం పలుమార్లు ప్రైవేట్ కంపెనీలను హెచ్చరించినా, ఉద్యోగులు మాత్రం నిరంతరం దోపిడీకి గురవుతున్నారు.
'996'కి ఒకప్పుడు జాక్ మా మద్దతు
ఒకానొక సమయంలో, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కూడా '996' పని సంస్కృతికి మద్దతు ఇచ్చాడు. 996 వర్క్ కల్చర్ అనేది వరం కంటే తక్కువ కాదని, కేవలం 8 గంటల షిఫ్ట్‌లలో పనిచేసే వారికి అలీబాబాలో స్థానం లేదని జాక్ మా అన్నారు.
70 గంటలు పని చేయాలని సూచించిన నారాయణమూర్తి
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గత సంవత్సరం వారానికి 70 గంటలు పని చేయాలని సూచించారు. యువత మరింత పని చేయాలని సూచించారు. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అక్టోబర్ 2023లో, భారతదేశం పని ఉత్పాదకత ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని నారాయణ మూర్తి ఓపోడ్‌కాస్ట్‌లో చెప్పారు. చైనా వంటి దేశాలతో పోటీ పడాలంటే భారతీయ యువత అదనపు గంటలు పనిచేయాలన్నారు.
లాంగ్ షిఫ్టులలో పనిచేయడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?
లాంగ్ షిఫ్టులలో పనిచేయడం వల్ల చాలా ప్రతికూలతలు ఉన్నాయని, ప్రపంచంలోని చాలా దేశాలు వారానికి 5 రోజుల పని చేయాలని పట్టుబట్టడానికి ఇదే కారణం. కొన్ని దేశాల్లో వారానికి 4 రోజుల సంస్కృతి కూడా అవలంబిస్తున్నారు. రోజుకు 7-8 గంటల కంటే ఎక్కువ పని చేస్తే శరీరానికి సరైన విశ్రాంతి లభించదని, దీంతో ఒత్తిడి, అలసట, చిరాకు పెరుగుతాయని వైద్యులు తెలుపుతున్నారు. దీని వల్ల రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, నిద్రలేమి వంటి అనేక సమస్యలు వస్తాయి.