CIA: చైనా సైన్య ప్రక్షాళనపై అమెరికా కన్ను: సీఐఏ కొత్త వ్యూహం
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో షీ జిన్‌పింగ్ ప్రభుత్వం సైన్యంలో అమలు చేస్తున్న ప్రక్షాళన చర్యలను అమెరికా ఒక అవకాశంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతికి పాల్పడే వారిపై చైనా కఠిన చర్యలు చేపడుతుండగా, రాజకీయంగా విధేయత చూపని లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం వినిపించే అధికారులను అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా అధికారులనే లక్ష్యంగా చేసుకుని అమెరికా నిఘా సంస్థ సీఐఏ వల విసురుతోంది. దీనిలో భాగంగా మాండరిన్ భాషలో ఒక రిక్రూట్‌మెంట్ వీడియోను సీఐఏ విడుదల చేసింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆ వీడియోలో ఒక వర్చువల్ చైనా అధికారి మాట్లాడినట్లుగా చూపించారు.
వివరాలు
చైనాలో గూఢచారులను నియమించుకునే ప్రయత్నంలో.. అమెరికా ఈ తరహా ప్రచారం
దేశంలో నెలకొన్న పరిస్థితులపై అతడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ''మన నాయకులు తమ స్వప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. విలువలకు కట్టుబడి ఉండటానికి, నా కుటుంబానికి మెరుగైన భవిష్యత్ కల్పించాలనే ఉద్దేశంతోనే నేను సీఐఏను సంప్రదించాను'' అని అతడు పేర్కొన్నాడు. ఇదే సందర్భంగా ఆ నిఘా సంస్థ డైరెక్టర్ స్పందిస్తూ, చైనా అధికారులు, పౌరులకు మంచి భవిష్యత్ దిశగా అవకాశాలు అందించేందుకు తాము ఎప్పటికీ సిద్ధంగా ఉంటామని వెల్లడించారు. చైనాలో గూఢచారులను నియమించుకునే ప్రయత్నంలో భాగంగానే అమెరికా ఈ తరహా ప్రచారం చేపట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
జనరల్ లియు జెన్లీని తొలగించిన ప్రభుత్వం
ఇటీవల చైనాలో అత్యంత శక్తివంతమైన ఒక సైనికాధికారి తన పదవిని కోల్పోయారు. అవినీతికి పాల్పడటమే కాకుండా కీలకమైన అణ్వాయుధాల రహస్యాలను విదేశీ శక్తులకు లీక్ చేశారన్న ఆరోపణలతో ఆయనపై విచారణ కొనసాగుతోంది. అదేవిధంగా మరో జనరల్ లియు జెన్లీని కూడా ప్రభుత్వం తొలగించింది. గత కొన్నేళ్లుగా చైనా జనరళ్లు తరచుగా వివాదాల్లో చిక్కుకొని పదవులు కోల్పోతుండటం గమనార్హం. ఇలాంటి సైనిక ప్రక్షాళనలు గతంలో మావో జెడాంగ్ పాలన సమయంలోనూ చోటుచేసుకున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో సీఐఏ విడుదల చేసిన ఈ వీడియోపై చైనా ప్రభుత్వం తీవ్రంగా స్పందించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.