US Deportation: అమెరికా డిపార్టేషన్ ప్రక్రియపై మండిపడ్డ కొలంబియా, బ్రెజిల్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠినమైన చర్యలు అందరికీ తెలిసిందే.
అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారికి గుర్తింపు ఇచ్చి, ప్రత్యేక విమానాల ద్వారా వారి స్వదేశాలకు పంపించే కార్యక్రమం కొనసాగుతోంది.
ఈ విధానం పట్ల పలు దేశాలు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
అందులో భాగంగా కొలంబియా, ఇలాంటి వలసదారుల విమానాలను తమ దేశంలోకి అనుమతించబోమని తేల్చి చెప్పింది. అలాగే, బ్రెజిల్ కూడా ఈ చర్యలపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.
వివరాలు
అమెరికా సైనిక విమానాలను వెనక్కి పంపించిన కొలంబియా
''కొలంబియా వలసదారులను తీసుకురావడానికి అమెరికా పంపిన విమానాలను మా దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నాం'' అని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ప్రకటించారు.
వలసదారులను గౌరవంతో పంపించే విధంగా అమెరికా నిబంధనలు రూపొందిస్తేనే వాటిని అనుమతిస్తామని తెలిపారు.
ఇప్పటికే కొలంబియా అమెరికా సైనిక విమానాలను వెనక్కి పంపించినట్లు తెలిపారు.
అయితే, నేరస్థులుగా చూపించకుండా, పౌర విమానాల్లో పంపిస్తే ఆ విమానాలను అనుమతిస్తామని పెట్రో స్పష్టంచేశారు.
ఇక బ్రెజిల్నుండి కూడా అమెరికా విధానంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వలసదారుల చేతులకు సంకెళ్లు వేసి, విమానాల్లో పంపించడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే చర్యగా బ్రెజిల్ పేర్కొంది.
ఇది తమకు అందిరకాలంగా అంగీకారమయ్యే అంశం కాదని వ్యాఖ్యానించింది.
వివరాలు
దేశవ్యాప్తంగా 538 మందికి పైగా అక్రమ వలసదారులు
అదే సమయంలో, అమెరికాలో అక్రమంగా ప్రవేశించి దొంగతనాలు, హింస వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవడం కొనసాగుతూనే ఉంది.
అధ్యక్షుడి ఆదేశాల మేరకు, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 538 మందికి పైగా అక్రమ వలసదారులను అమెరికా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.