LOADING...
Donald Trump: శాంతి ప్రణాళికపై వివాదం.. 'జెలెన్‌స్కీకి పోరాడే సత్తా ఉందన్న ట్రంప్
శాంతి ప్రణాళికపై వివాదం.. 'జెలెన్‌స్కీకి పోరాడే సత్తా ఉందన్న ట్రంప్

Donald Trump: శాంతి ప్రణాళికపై వివాదం.. 'జెలెన్‌స్కీకి పోరాడే సత్తా ఉందన్న ట్రంప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

మూడేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ (Russia-Ukraine) యుద్ధానికి తెరదించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) రూపొందించిన 28 సూత్రాల శాంతి ప్రణాళికపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు రగులుతున్నాయి. రష్యాకు అనుకూలంగా అనిపించే పలు ప్రతిపాదనల కారణంగా ఉక్రెయిన్‌తో పాటు దాని మిత్ర దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి ప్రణాళికపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అందించిన ప్రణాళిక చివరి ప్రతిపాదన కాదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే ఉక్రెయిన్‌కు గురువారం లోపే ఈ ప్లాన్‌పై స్పందించాలని అల్టిమేటం జారీ చేసిన ట్రంప్, విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, ఇది 'ఫైనల్ ఆఫర్' కాదని అన్నారు.

Details

తాము కోరేది శాంతి మాత్రమే

జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే? అనే ప్రశ్నకు, "తన చిన్న హృదయంతో అతడు పోరాడగలడు" అంటూ వ్యాఖ్యానించారు. తాము కోరేది శాంతి మాత్రమేనని, ఏదో ఒక విధంగా జరుగుతున్న ఈ యుద్ధాన్ని ముగించాల్సిందేనని పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌, జర్మనీ, అలాగే ఉక్రెయిన్‌కు చెందిన సీనియర్ భద్రతా అధికారులు జెనీవాలో సమావేశమై ఈ ప్రణాళికను మెరుగుపరచే దిశగా చర్చించనున్నట్లు సమాచారం. శాంతి ప్రణాళికపై జెలెన్‌స్కీ మళ్ళీ స్పందిస్తూ, యుద్ధం ముగించేందుకు అవసరమైన చర్యలపై తమ భాగస్వాములతో చర్చలు జరిపామని తెలిపారు. ఉక్రెయిన్‌ జాతీయ ప్రయోజనాలను కాపాడటమే కాకుండా, రష్యా మళ్ళీ దాడి చేయకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది.

Details

శాంతి చర్చల ద్వారానే సమస్య పరిష్కారం

యుద్ధం మొదలుపెట్టేది ఎప్పుడూ ఉక్రెయిన్ కాదని, శాంతి చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాలనేది తమ అభిప్రాయం అని పేర్కొంది. అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో డొనెట్స్క్‌ వంటి కీలక ప్రాంతాలను ఉక్రెయిన్ విడిచిపెట్టడం, సైన్యాన్ని తగ్గించడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనపై రష్యా ఇప్పటికే సానుకూలంగా స్పందించి చర్చలకు సిద్ధమని తెలిపింది. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ అంగీకరించాల్సిందేనని అమెరికా ఒత్తిడి తెస్తోందని చెప్పబడుతోంది. అగ్రరాజ్యం ఒత్తిడికి లోనై ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ శాంతి ప్రణాళికను అంగీకరిస్తారా లేదా అనేది ఇప్పుడు అంతర్జాతీయ దృష్టి ఆకర్షిస్తోంది.