Elon Musk: ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్ల లెక్కింపు.. భారత ఎన్నికల ప్రక్రియను ప్రశంసించిన ఎలాన్ మస్క్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత ఎన్నికల ప్రక్రియ విధానాన్ని కొనియాడారు. కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భారత ఎన్నికల నిర్వహణపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎక్స్ వేదికగా మస్క్ ఒక వార్త కథనాన్ని షేర్ చేస్తూ 'భారతదేశం ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లు లెక్కించింది. కానీ కాలిఫోర్నియా ఇంకా లెక్కింపులోనే ఉంది' అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నెల 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినట్లు ప్రకటించారు. అయినా అత్యధిక జనాభా కలిగిన కాలిఫోర్నియాలో ఇప్పటికీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుండటం గమనార్హం.
కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపులో ఆలస్యం
కాలిఫోర్నియాలో మెయిల్ ఓట్ల పెరుగుదలతో లెక్కింపులో ఆలస్యాలు జరుగుతున్నాయి. అధికారుల ప్రకారం, ఇప్పటికే 98 శాతం కౌంటింగ్ పూర్తియైనా మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని తెలిపారు. కాలిఫోర్నియా 54 ఎలక్టోరల్ ఓట్లను డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ సాధించారు. ఇది డెమోక్రాటిక్ పార్టీకి కీలక విజయంగా నిలిచింది. మస్క్ చేసిన వ్యాఖ్యలు భారత ఎన్నికల నిర్వహణ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాయి. ఒకే రోజులో 640 మిలియన్ల ఓట్లను సక్రమంగా లెక్కించడమే ఇందుకు ఉదాహరణ.