
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే.
తాజా పరిణామాల్లో,యూనస్‌పై వ్యతిరేకత పెరిగిపోతోందని,తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చెలరేగే అవకాశం ఉందని సమాచారం.
ఈ నేపథ్యంలో,అక్కడి సైనిక వర్గాలు అత్యవసర సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది.
వివిధ మీడియా వర్గాల్లో ఈ పరిణామాలపై కథనాలు వెలువడుతున్నాయి.
బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ ఆధ్వర్యంలో అత్యవసర భేటీ జరిగింది.
ఇందులో ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్,ఎనిమిది మంది మేజర్ జనరల్స్‌తో పాటు ఇతర ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు.
వివరాలు
సైన్యం ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత ప్రభుత్వం
యూనస్ పదవి చేపట్టినప్పటి నుండి ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని,ప్రభుత్వంపై అపనమ్మకం ఏర్పడిందని ఆర్మీ వర్గాలు తెలియజేశాయి.
తద్వారా,సమీప భవిష్యత్తులో దేశం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, దేశంలో స్థిరత్వాన్ని కాపాడే బాధ్యత ఎక్కువగా ఆర్మీదేనని అధికారి వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సమావేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి, యూనస్‌పై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అంతేకాదు, సైన్యం ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
దేశంలో పెరుగుతున్న నిరసనలు - సైన్యం అలెర్ట్
ఇటీవల బంగ్లాదేశ్‌లో సైన్యానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు గళమెత్తాయి.
ఈక్రమంలో యూనస్ పాలనపై తిరుగుబాటు ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
దీనికి ప్రతిస్పందనగా, సైన్యం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా రాజధాని ఢాకాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయబడగా, వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.
ఇక షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి సైన్యం సహకరిస్తుందనే ఆరోపణలు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
అయితే, బంగ్లా ఆర్మీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది.
వివరాలు
దేశం విడిచి వెళ్లిన షేక్ హసీనా
గతేడాది ఆగస్టులో, రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారిన సమయంలో, షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే.
అప్పటి నుండి ఆమె భారతదేశంలో తలదాచుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ బాధ్యతలను మహమ్మద్ యూనస్ నిర్వహిస్తున్నారు.