Earthquake: తుపానులు, విద్యుత్తు అంతరాయం తర్వాత.. క్యూబాలో 6.8 తీవ్రతతో భూకంపం..
తూర్పు క్యూబాలో ఆదివారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కారణంగా అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం బార్టోలోమ్ మాసోకు దక్షిణంగా సుమారు 25 మైళ్ళ (40 కి.మీ) దూరంలో ఉంది. శాంటియాగో డి క్యూబా వంటి పెద్ద నగరాలు కలిగిన ఈ తూర్పు ప్రాంతంలో భూకంప ప్రభావం కనిపించింది. ప్రాణ, ఆస్తి నష్టం సంబంధిత సమాచారం ఇంకా అందలేదు. శాంటియాగో నగర వాసులు ఈ భూకంపం వల్ల షాక్‌కు గురయ్యారు. 76 ఏళ్ల యోలాండా టాబియో తెలిపిన వివరాల ప్రకారం,నగరంలోని ప్రజలు భయంతో వీధుల్లోకి వచ్చారు, ఇప్పటికీ కొందరు తమ ఇంటి గుమ్మాలపై కూర్చొని ఉన్నారు.
పశ్చిమ క్యూబాను తీవ్రంగా ప్రభావితం చేసిన తుఫాను
భూకంపం తర్వాత కనీసం రెండు ప్రకంపనలు కూడా వచ్చాయని, కానీ ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులెవరూ నష్టపోలేదని అన్నారు. ఇప్పటికే సమస్యలతో కష్టపడుతున్న క్యూబాకు ఈ భూకంపం మరో పరీక్షగా మారింది. బుధవారం నాడు కేటగిరీ 3 రాఫెల్ తుఫాను పశ్చిమ క్యూబాను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీని ఫలితంగా ద్వీపం మొత్తం విద్యుత్ సప్లై ఆగిపోయింది, వందలాది ఇళ్ళు ధ్వంసమయ్యాయి, వేలాది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది. ఇంకా కొన్ని ప్రాంతాలు విద్యుత్తు లేకుండా ఇబ్బందులు పడుతున్నాయి.
ద్వీపంలో నిరసనలు
అక్టోబర్‌లో కూడా క్యూబా తీవ్రమైన బ్లాక్‌అవుట్‌లకు గురై, కొన్ని రోజులు విద్యుత్తు లేని పరిస్థితిని ఎదుర్కొంది. ఈ పరిస్థితి తర్వాత పశ్చిమ భాగాన్ని ప్రభావితం చేసిన శక్తివంతమైన తుఫాను వల్ల కనీసం ఆరుగురు మరణించారు. ఈ కష్టసమయ పరిస్థితులు, బ్లాక్‌అవుట్‌ల కారణంగా ద్వీపంలోని ప్రజల్లో విస్తృతంగా అసంతృప్తి నెలకొంది, దీని ఫలితంగా అక్కడ చిన్న నిరసనలు వెలువడ్డాయి.