Loading...
Denmark: 'నా ముక్కు గురించి మీకెందుకు?'.. అనవసర సలహాలపై డెన్మార్క్ ప్రధాని ఆగ్రహం
'నా ముక్కు గురించి మీకెందుకు?'.. అనవసర సలహాలపై డెన్మార్క్ ప్రధాని ఆగ్రహం

Denmark: 'నా ముక్కు గురించి మీకెందుకు?'.. అనవసర సలహాలపై డెన్మార్క్ ప్రధాని ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

తన అందం, శరీరాకృతిపై అనవసరమైన సలహాలు ఇస్తున్నవారిపై డెన్మార్క్‌ ప్రధానమంత్రి ఫ్రెడెరిక్సన్‌ (48) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన రూపం గురించి పదేపదే వ్యాఖ్యలు చేయడం, శరీరంలో లోపాలు వెతకడంపై ఆమె మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేశారు. ''ఇప్పుడే ఉక్రెయిన్‌ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాను. నా ముక్కుపై ఉన్న పులిపిరి కాయను సరిచేస్తానంటూ ఓ ప్లాస్టిక్‌ సర్జన్‌ నాకు మెసేజ్‌ పంపారు. గత కొన్నేళ్లుగా నా అందం గురించి ఇలాంటి మెసేజ్‌లు ఎన్నో వచ్చాయి'' అని ఫ్రెడెరిక్సన్‌ తెలిపారు. తన దంతాలు బాగోలేవని, జుట్టు పలుచగా ఉందని, ముక్కుపై ఉన్న పులిపిరి కాయ అసహ్యంగా ఉందంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె చెప్పారు.

వివరాలు 

పురుష ప్లాస్టిక్‌ సర్జన్‌ సలహాలు నాకు అవసరం లేదు: ఫ్రెడెరిక్సన్

''50 ఏళ్లకు చేరువవుతున్న మహిళగా నా శరీరం విషయంలో నేను సంతోషంగానే ఉన్నాను. నా శరీరం గురించి ఓ పురుష ప్లాస్టిక్‌ సర్జన్‌ సలహాలు నాకు అవసరం లేదు'' అని స్పష్టం చేశారు.

ఇతరులు ఎలా ఉంటారనే విషయం తనకు అనవసరమని ఫ్రెడెరిక్సన్‌ అన్నారు.

''నా గురించి ఏదైనా రాయాలనుకుంటే.. ఆ సమయాన్ని అర్థవంతమైన విషయాల కోసం కేటాయించండి. నా ముక్కు గురించి రాయడానికి మాత్రం ఆ సమయాన్ని ఉపయోగించకండి'' అని సూచించారు.

తన రూపం, అందంపై వస్తున్న సౌందర్య సలహాలు తనకు ఆగ్రహం తెప్పిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

వ్యక్తుల రూపురేఖలపై వ్యాఖ్యలు చేయడం కంటే, ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలని తన పోస్టు ద్వారా ఫ్రెడెరిక్సన్‌ స్పష్టం చేశారు.

ADVERTISEMENT