Davos 2026: ఈ ఏడాది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం ఎందుకు కీలకం?
ఈ వార్తాకథనం ఏంటి
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సమావేశం-2026 సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రారంభమైంది. మహ్లర్ చాంబర్ ఆర్కెస్ట్రా, ఫ్రెంచ్ వైలినిస్ట్ రెనాడ్ కాప్యుసాన్, గ్రామీ అవార్డు గ్రహీత జాన్ బాటిస్ట్ ప్రదర్శనలతో ఆరంభోత్సవం జరిగింది. ఈ సమావేశం జనవరి 23 వరకు కొనసాగనుంది. ఈసారి సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు. అంతర్జాతీయ వాణిజ్య సంస్థ (WTO) డైరెక్టర్ జనరల్ ఎన్‌గోజీ ఒకోంజో-ఇవీలా, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు అజయ్ ఎస్ బంగా కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
వివరాలు
సమావేశంలో ప్రసంగించనున్న ట్రంప్
ఈ ఏడాది థీమ్‌గా "A Spirit of Dialogue"ను ఎంపిక చేశారు. ప్రభుత్వాలు,వ్యాపార రంగం,పౌర సమాజం కలిసి సామూహిక సవాళ్లపై చర్చించి,ఆవిష్కరణలకు దారి తీసే వేదికగా దావోస్‌ను మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 130కిపైగా దేశాల నుంచి సుమారు 3,000 మంది నాయకులు పాల్గొంటున్నారు. వీరిలో దాదాపు 400 మంది రాజకీయ నేతలు,850 మంది వరకు సీఈవోలు ఉన్నారు. ఈ సమావేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం ట్రంప్ ప్రసంగమే. బుధవారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2గంటలకు ట్రంప్ "స్పెషల్ అడ్రస్" ఇవ్వనున్నారు. ప్రసంగ వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. అయితే యూరోపియన్ మిత్రదేశాలపై టారిఫ్‌ల హెచ్చరికలు,వెనిజువెలాలో సైనిక జోక్యం,గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ఆయన ఆకాంక్ష వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశముందని అంచనా.
వివరాలు
నేరుగా యూరోపియన్ నాయకులను ఉద్దేశించి ప్రసంగించనున్న ట్రంప్
దేశీయంగా జీవన వ్యయాల పెరుగుదలపై ఒత్తిడి ఎదుర్కొంటున్న ట్రంప్, ఇళ్ల ధరలు తగ్గించేందుకు చర్యలను ప్రకటించడంతో పాటు, అమెరికా ఆర్థిక వృద్ధికి దోహదపడిన తన ఆర్థిక అజెండాను ప్రస్తావించనున్నారు అని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో యూరోపియన్ నేతలను ఉద్దేశించి, ఆర్థిక స్థబ్దత నుంచి బయటపడాల్సిన అవసరాన్ని, దానికి కారణమైన విధానాలను వదిలేయాల్సిందిగా సూచించనున్నారని చెప్పారు. ఈసారి దావోస్ సమావేశం మరో ప్రత్యేకతతోనూ సాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వ్యవస్థాపకుడు క్లాస్ ష్వాబ్ లేకుండానే ఈ సమావేశం జరుగుతోంది. 1971లో తొలి దావోస్ సదస్సు నిర్వహించిన 87 ఏళ్ల ష్వాబ్, అనధికార ఖర్చుల ఆరోపణల నేపథ్యంలో గతేడాది బోర్డు నుంచి తప్పుకున్నారు.
వివరాలు
ఫౌండర్ లేకుండానే కార్యక్రమం జరుగనుంది
అయితే తాను, తన భార్య హిల్డే ఫోరాన్ని వ్యక్తిగత లాభాల కోసం ఎప్పుడూ ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. స్విస్ లా ఫర్మ్ హోంబర్గర్ విచారణ అనంతరం, కీలక తప్పిదాలేవీ లేవని WEF ట్రస్టీల బోర్డు తేల్చింది. దావోస్ 2026 అజెండాలో ప్రపంచ సవాళ్లు, అవకాశాలపై విస్తృత చర్చలు ఉన్నాయి. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, క్షీణిస్తున్న కూటముల మధ్య సహకారాన్ని పునరుద్ధరించడం, భౌగోళిక రాజకీయ ప్రమాదాలు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. జనరేటివ్ ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు, ఉద్యోగ భద్రత, మానవ సంక్షేమం, పర్యావరణ పరిమితుల్లోనే సంపద పునర్నిర్మాణం, శక్తి-నీటి-ప్రకృతి వ్యవస్థల భద్రత వంటి అంశాలు కూడా ప్రధాన చర్చాంశాలుగా నిలవనున్నాయి.