Hajj pilgrimage: హజ్ యాత్ర మిగిల్చిన విషాదం.. వేడి ధాటికి 1,300 మందికి పైగా మృత్యువాత
సౌదీ అరేబియాలో ఈ ఏడాది హజ్ యాత్ర సందర్భంగా ఇస్లామిక్ పవిత్ర స్థలాల వద్ద భక్తులు వేలాదిగా మరణించారని సౌదీ అధికారులు ఆదివారం ప్రకటించారు. తీవ్రమైన అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొన్నందున 1,300మందికి పైగా మృత్యువాత పడ్డారని అధికారికంగా తెలిపారు.ఈసంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. 1,301 మరణాలలో 83శాతం మంది అనధికారిక యాత్రికులు ఉన్నారని,సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-జలాజెల్. తెలిపారు. వారి మృతికి అధిక ఉష్ణోగ్రతలు కారణం అయిందనన్నారు.కాగా మండే ఎండల్లో మత ఆచారాల ప్రకారం చాలా దూరం నడిచారని ఆయన వివరించారు. 95మంది యాత్రికులు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.వారిలో కొందరిని రాజధాని రియాద్‌లో చికిత్స కోసం విమానంలో తరలించినట్లు అల్ ఎఖ్‌బరియా టీవీకి మంత్రి చెప్పారు.
మృతుల్లో 660 మందికి పైగా ఈజిప్షియన్లు
చనిపోయిన అనేక మంది యాత్రికులకు ఎలాంటి గుర్తింపు పత్రాలు లేనందున గుర్తింపు ప్రక్రియ ఆలస్యమైందన్నారు. మృతులను మక్కాలో ఖననం చేశామని, ఎలాంటి విఘాతం కలగకుండా చేశామన్నారు.మరణాలలో 660 మందికి పైగా ఈజిప్షియన్లు ఉన్నారు. కైరోలోని ఇద్దరు అధికారుల ప్రకారం, వారిలో 31 మంది మినహా అందరూ అనధికార యాత్రికులు. అనధికార యాత్రికులు సౌదీ అరేబియాకు వెళ్లేందుకు సహకరించిన 16 ట్రావెల్ ఏజెన్సీల లైసెన్స్‌లను ఈజిప్ట్ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
బస కోసం,కాలి నడకన అనధికార యాత్రికులు
ఈ పరిస్థితిపై మాట్లాడిన అధికారులు,చనిపోయిన వారిలో ఎక్కువ మంది మక్కాలోని అల్-ముయిసెమ్ పరిసరాల్లోని ఎమర్జెన్సీ కాంప్లెక్స్‌లో చోటు చేసుకున్నాయని చెప్పారు. ఈ ఏడాది సౌదీ అరేబియాకు ఈజిప్ట్ 50,000మందికి పైగా అధికారికంగా యాత్రికులను పంపింది. సౌదీ అధికారులు అనధికార యాత్రికులపై కఠినంగా వ్యవహరించి, పదివేల మందిని బహిష్కరించారు. కానీ చాలామంది,ఎక్కువగా ఈజిప్షియన్లు,మక్కా చుట్టుపక్కల ఉన్నపవిత్ర స్థలాలను చేరుకోగలిగారు. యాత్రికులకు తగిన సేవలను అందించడంలో 16 ట్రావెల్ ఏజెన్సీలు విఫలమయ్యాయని ఈజిప్టు ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏజెన్సీలు మక్కాకు వెళ్లేందుకు అనుమతించని వీసాలను ఉపయోగించి సౌదీ అరేబియాకు యాత్రికుల ప్రయాణాన్ని చట్టవిరుద్ధంగా సులభతరం చేశాయని పేర్కొంది. కంపెనీల అధికారులను విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు పంపినట్లు ప్రభుత్వం తెలిపింది.
ట్రావెల్ ఏజెన్సీల కాసుల కక్కుర్తే యాత్రికుల మృతికి కారణం
ప్రభుత్వ యాజమాన్యంలోని అల్-అహ్రమ్ దినపత్రిక ప్రకారం,కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు,హజ్ ట్రిప్ ఆపరేటర్లు సౌదీ పర్యాటక వీసాలను ఈజిప్టు హజ్ ఆశావహులకు విక్రయించారు. యాత్రికుల కోసం ప్రత్యేక వీసాలు అవసరమయ్యే సౌదీ నిబంధనలను ఉల్లంఘించారు. ఆ ఏజెన్సీలు యాత్రికులను మక్కాలో పవిత్ర స్థలాలను మండే వేడిలో వదిలివేసినట్లు వార్తాపత్రిక తెలిపింది. అసోసియేటెడ్ ప్రెస్ లెక్క ప్రకారం,మరణాలలో ఇండోనేషియా నుండి 165 మంది యాత్రికులు, భారతదేశం నుండి 98 మంది,జోర్డాన్,ట్యునీషియా,మొరాకో,అల్జీరియా, మలేషియా నుండి డజన్ల కొద్దీ యాత్రికులు ఉన్నారు. ఇద్దరు అమెరికా పౌరులు కూడా మరణించినట్లు సమాచారం.