Houthis: యెమన్‌పై భారీ వైమానిక దాడులు.. 53 మంది మృతి..
ఈ వార్తాకథనం ఏంటి
సుమారు ఏడాదిన్నరగా హూతీ తిరుగుబాటుదారుల అదుపులో ఉన్న ఇజ్రాయెల్ నౌక "ది గెలాక్సీ లీడర్" పై అమెరికా తీవ్రంగా ప్రతిదాడికి దిగింది.
ఈ దాడిలో నౌకలోని కమాండ్ పోస్టు పూర్తిగా ధ్వంసమైనట్లు సబా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
గగనతల దాడి ద్వారా ఈ లక్ష్యాలను ఛేదించినట్లు తెలుస్తోంది. హూతీ తిరుగుబాటుదారులు 2023 నవంబర్‌లో ఈ నౌకను హైజాక్ చేశారు.
అయితే, 25 మంది సిబ్బందిని కొన్నాళ్ల తర్వాత విడుదల చేశారు.
వీరిలో ఫిలిప్పీన్స్, రొమానియా, బల్గేరియా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు.
సుమారు 430 రోజులుగా ఈ నౌక యెమన్ తీరంలోని హుదెయిద్ పోర్టు వద్ద నిలిపివేయబడింది. ఈ నౌకలో ఇజ్రాయెల్‌కు చెందిన వ్యాపారవేత్త ఇబ్రహీం ఉంగర్ వాటాదారుడిగా ఉన్నట్లు సమాచారం.
వివరాలు
అమెరికా విమాన వాహక నౌకపై హూతీ ప్రతిదాడి
అమెరికా దాడులకు ప్రతిస్పందనగా, హూతీ రెబల్స్ కూడా తీవ్ర ప్రతిదాడులకు ప్రయత్నించారు.
సోమవారం రెండు విడతలుగా అమెరికా విమాన వాహక నౌకా సమూహంపై దాడి చేసినట్లు వెల్లడించారు.
మొదటి దాడిలో 18 క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించామని, ముఖ్యంగా యూఎస్‌ఎస్ హారీ ట్రూమన్, దాని అనుబంధ నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.
కొన్ని గంటల తర్వాత మరోసారి దాడి చేసినట్లు హూతీ నేతలు ప్రకటించారు. ఈ దాడుల గురించి టెలిగ్రామ్ ఛానెల్‌లో అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అమెరికాపై తమ ప్రతిదాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయితే, అమెరికా వర్గాలు మాత్రం హూతీలు ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను అంతరించగొట్టినట్లు ప్రకటించాయి.
వివరాలు
అమెరికా దాడుల్లో 53 మంది మృతి
అమెరికా ఇప్పటివరకు చేసిన వైమానిక దాడుల్లో 53 మంది మరణించగా, 98 మంది గాయపడినట్లు హూతీల ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఈ మృతుల్లో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఆదివారం రాత్రి, అమెరికా యెమన్‌లో ఒక కాటన్ జిన్నింగ్ ఫ్యాక్టరీపై దాడి నిర్వహించినట్లు తెలుస్తోంది. "యెమన్‌లో ఆపరేషన్ కొనసాగుతోంది" అని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇక హూతీ నేత అబ్దుల్ మాలిక్ అల్ హూతీ యెమన్ ప్రజలను దేశ రక్షణ కోసం సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
అయితే, ఐక్యరాజ్య సమితి మాత్రం ఇరువైపులా సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని కోరింది.