HMPV: చైనాలో హెచ్ఎంపీవీ కేసులు తగ్గుదల.. ఇండియాలో 17 నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో మానవ మెటాప్న్యూమోవైరస్ కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.
అయితే ఈ కొత్త వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొత్త మహమ్మారి వచ్చే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
భారతదేశంలో ఇప్పటివరకు 17 కేసులు నమోదయ్యాయి. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మానవ మెటాప్న్యూమోవైరస్ కొత్తది కాదని, ఈ వైరస్ చాలా దశాబ్దాలుగా ఉందని, ప్రస్తుతం ఈ వైరస్ నిర్ధారణలో పాజిటివ్ కేసుల శాతం తగ్గుముఖం పడుతోందని చైనా సీడీసీ పరిశోధకుడు వాంగ్ లిపింగ్ తెలిపారు.
చైనాలోని ఉత్తర ప్రదేశాల్లో పాజిటివ్ రేటు తగ్గుతుండగా, 14 ఏళ్లలోపు పిల్లల్లో పాజిటివ్ రేటు క్రమంగా తగ్గుతున్నట్లు తెలిపారు.
Details
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
గత కొన్ని రోజులుగా చైనాలో హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ల పెరుగుదలపై ఆందోళన నెలకొంది. హాస్పిటల్స్‌లో పెద్ద సంఖ్యలో మాస్కులు ధరించిన రోగులు కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా లేదా ఇతర దేశాల్లో అసాధారణ కేసుల సంఖ్య పెరిగిందని నివేదికలు అందలేదని వెల్లడించింది. ఇండియాలో ఇప్పటికే 17 కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో భారత అధికారులు అన్ని నగరాల్లో ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు.
భారతదేశంలో నమోదైన 17 కేసుల్లో, గుజరాత్‌లో ఐదు కేసులు గుర్తించారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మూడేసి కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడులో రెండేసి కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక అస్సాంలో ఒక కేసు, పుదుచ్చేరిలో ఒక కేసు నమోదయ్యాయి.