LOADING...
Delta Airlines: కెనడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం.. 18 మందికి గాయాలు 
కెనడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం.. 18 మందికి గాయాలు

Delta Airlines: కెనడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం.. 18 మందికి గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2025
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలోని టొరంటో పియర్‌సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి తలకిందులుగా బోల్తాపడింది. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు, ఓ చిన్నారి సహా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. 76 మంది ప్రయాణికులు,నలుగురు సిబ్బందితో మిన్నెపొలిస్‌ నుంచి బయల్దేరిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం పియర్‌సన్‌ విమానాశ్రయ రన్‌వేపై ల్యాండ్‌ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రన్‌వేపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో విమానం జారి బోల్తాపడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంతో విమానంలో మంటలు చెలరేగాయి.అయితే,ఎమర్జెన్సీ సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపు చేసి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వివరాలు 

టొరంటో విమానాశ్రయంలో ఉష్ణోగ్రత మైనస్‌ 8.6 డిగ్రీలు

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను ఇంకా నిర్ధారించలేమని అధికారులు తెలిపారు. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో టొరంటో విమానాశ్రయంలో ఉష్ణోగ్రత మైనస్‌ 8.6 డిగ్రీలుగా ఉండగా, గంటకు 51 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీవ్రంగా మంచు పేరుకుపోవడంతో ల్యాండింగ్‌ ఇబ్బందికరంగా మారినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కెనడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం