Houthi Rebels: US హెచ్చరికను పట్టించుకోని హౌతీలు.. ఎర్ర సముద్రంలో డ్రోన్ బోట్‌పై దాడి
ఎర్రసముద్రం(Red Sea)లో వాణిజ్య నౌకలపై చేస్తున్న దాడులను హౌతీ రెబెల్స్ వెంటనే ఆపాలని అమెరికాతో సహా 12 మిత్ర దేశాలు హెచ్చరించాయి. ఈ దాడులు ఆపకపోతే తమ మిలిటరీకి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరికలు కూడా జారీ చేశాయి. అయిన అమెరికా హెచ్చరికలను హౌతీ రెబల్స్ పట్టించుకోలేదు.మరోసారి గురువారం ఎర్ర సముద్రంలోవాణిజ్య నౌకలపై దాడికి దిగింది. పేలుడు పదార్థాలు ఉపయోగించి దాడులకు తెగబడింది. ఇజ్రాయోల్- గాజా యుద్ధం తర్వాత హౌతీలు వాణిజ్య నౌకలపై దాడులు చేయడం పెరిగింది. హౌతీ అంతర్జాతీయ షిప్పింగ్‌కు విఘాతం కలిగిస్తుంది. దీనివల్ల కొన్ని కంపెనీలు ఎర్ర సముద్రం గుండా రవాణాను కూడా నిలిపివేసాయి. దానికి బదులుగా ఎక్కువ ఖర్చు పెట్టి ఆఫ్రికా చుట్టూ నుండి రవాణా చేస్తున్నాయి.
దాడికి గురైన నౌకలకు 55దేశాలతో ప్రత్యక్ష సంబంధాలు
యుఎస్ నావికా దళాలకు నాయకత్వం వహిస్తున్న వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ..హౌతీ పేలుడుకు ముందు మానవరహిత ఉపరితల నౌక(USV)యెమెన్ నుంచి అంతర్జాతీయ షిప్పింగ్ లైన్‌లలోకి వస్తుండగా దానిపై డ్రోన్లతో ఎటాక్ చేసిందని తెలిపారు. అయితే,మానవరహిత ఉపరితల నౌక దాడి లక్ష్యం ఏంటనేది స్పష్టంగా చెప్పలేదు.దక్షిణ ఎర్ర సముద్రం,ఏడెన్ గల్ఫ్ మీదుగా రవాణా చేసే వ్యాపార నౌకలపై హౌతీలు ఇప్పటిదాకా 25 దాడులు చేశారని కూపర్ తెలిపారు. దాడికి గురైన నౌకలకు 55దేశాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని కూపర్ చెప్పారు. ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఉన్ననౌకలను లక్ష్యంగా చేసుకుని హమాస్‌కు మద్దతుగానే హౌతీలు ఈ దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇరాన్ నుంచి పూర్తి స్థాయిలో హౌతీలకు సహాయ సహకారాలు అందుతున్నాయని అంటున్నారు.