Houthis: ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులను ఆపండి.. హౌతీలకు అమెరికాతో సహా 12 దేశాలు వార్నింగ్
ఎర్రసముద్రం(Red Sea)లో వాణిజ్య నౌకలపై చేస్తున్న దాడులను హౌతీ రెబర్స్ వెంటనే ఆపాలని, లేకుంటే సైనిక తమ మిలిటరీకి పని చెప్పాల్సి ఉంటుందని అమెరికాతో సహా 12 మిత్ర దేశాలు హెచ్చరించారు. ఈ మేరకు 12 దేశాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రకటనపై యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యునైటెడ్ కింగ్‌డమ్ సంతకాలు చేశాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ప్రతిస్పందనగా గతేడాది డిసెంబర్ 19 నుంచి ఇప్పటివరకూ హౌతీ రెబల్స్ ఎర్రసముద్రంలో 23 సరుకు రవాణా నౌకలపై దాడులు చేసిన విషయం తెలిసిందే.
దాడులకు ముగింపు పలకాలి
ఈ దాడులను తక్షణమే ముగింపు పలకాలని, అదే విధంగా చట్టవిరుద్ధంగా నిర్బంధించిన ఓడలు, సిబ్బందిని విడుదల చేయాలని కోరారు. అమెరికా నెవీ తన హెలికాప్టర్‌లో హైతీలు ఉన్న బోట్లపై దాడులు చేసి, నాలుగు బోట్లలో మూడు బోట్లను సముద్రంలో ముంచేసినట్లు అమెరికా కమాండ్ కంట్రోల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దాడుల్లో 10 మంది హౌతీలను అమెరికా నెవీ హతమార్చిన విషయం తెలిసిందే.