Cop conference: అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు రావాలి.. భారత్ హెచ్చరిక
బాకు వేదికగా జరుగుతున్న కాప్-29 సదస్సులో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన సాయం అందించడంలో అభివృద్ధి చెందిన దేశాలు వెనుకడుగు వేస్తున్నాయని భారత్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాతావరణ మార్పుల ప్రభావాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఉంటాయని, తగిన సాయం లేకుండా వాటిని ఎదుర్కొనే అవకాశం లేదని పేర్కొంది. కార్యాచరణకు సంబంధించిన ప్లీనరీ సందర్భంగా శనివారం భారత ప్రతినిధి నీలేశ్ శా ఈ విషయంపై మాట్లాడారు. గ్రీన్‌హౌస్ ఉద్గారాల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర వహిస్తున్న అభివృద్ధి చెందిన దేశాలు, ఈ బాధ్యతను వాయిదా వేస్తున్నాయని ఆరోపించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేక పరిస్థితులు, అవసరాల ప్రకారం లక్ష్యాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండాలన్నారు.
పురోగతి కనిపించడం లేదు
ఇవి గౌరవించకుండా, మద్దతు ఇవ్వకుండా శిక్షించడం తగదని శా పేర్కొన్నారు. వారం రోజులుగా జరుగుతున్న చర్చల్లో ఆశించిన పురోగతి కనిపించలేదని భారత్ వ్యాఖ్యానించింది. అగ్రరాజ్యాలు గట్టి చర్యలు తీసుకోవాలని భారతదేశం డిమాండ్ చేసింది. కాప్29 సదస్సు ప్రారంభమై సగం సమయం గడిచిపోయినా ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడం గమనార్హం. ఒప్పందాలపై చర్చలు వేగంగా సాగకపోవడంతో నిర్వాహకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఆయా ప్రభుత్వాల మంత్రుల రాకతో చర్చలకు కొత్త దిశ దొరకుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
భారత డిమాండ్లు
1. అభివృద్ధి చెందిన దేశాలు వెంటనే గట్టి చర్యలు చేపట్టాలి. 2. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన నిధులు, సాంకేతికత అందించాలి. 3. వాతావరణ మార్పుల విషయంలో సమాన బాధ్యతలు తీసుకోవాలి.