Donald Trump: పెర్ల్ హార్బర్ గురించి చెప్పలేదే?.. జపాన్ ప్రధానితో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని సనాయ్ టకైచి మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఒక జపాన్ జర్నలిస్టు, ఇరాన్‌పై దాడికి ముందు యూరప్, ఆసియా మిత్రదేశాలకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించగా ట్రంప్ స్పందిస్తూ, మేము దాడికి ముందు ఎవరికి చెప్పలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన జపాన్‌పై చారిత్రక వ్యాఖ్య చేశారు. ఆశ్చర్య దాడి అంటే జపాన్‌కే బాగా తెలుసు కదా. పెర్ల్ హార్బర్ గురించి నాకు ఎందుకు చెప్పలేదంటూ పేర్కొన్నారు.
Details
రెండ్రోజుల్లోనే 50శాతం లక్ష్యాలను చేధించాం
ట్రంప్ సూచించిన ఈ ఘటన పెరల్ హార్బర్‌పై దాడి. 1941 డిసెంబర్ 7న జపాన్, అమెరికా నౌకాదళ స్థావరంపై చేసిన ఈ ఆకస్మిక దాడిలో 2,390 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ ఈ రోజును 'చరిత్రలో చెరగని మచ్చ'గా అభివర్ణించారు. ఇక ప్రస్తుత పరిస్థితులపై ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్‌పై ఆకస్మిక దాడి వల్ల మొదటి రెండు రోజుల్లోనే 50 శాతం లక్ష్యాలను చేధించగలిగాం. ముందే చెప్పి ఉంటే ఈ విజయాలు సాధ్యమయ్యేవి కావని తెలిపారు. ఇదే సమయంలో జపాన్ ప్రధాని టకైచి, ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ ప్రపంచ భద్రతా పరిస్థితి తీవ్రంగా మారిందన్నారు.
Details
హర్ముజ్ జలసంధి మూసివేతపై ఆందోళన
ప్రపంచ శాంతి స్థాపనలో ట్రంప్ కీలక పాత్ర పోషించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతిని సాధించగల వ్యక్తి మీరు మాత్రమే అంటూ ట్రంప్‌ను ప్రశంసించారు. ఇరాన్ చర్యలను ఖండించిన టకైచి, హర్ముజ్ జలసంధి మూసివేతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ సముద్ర మార్గ చమురు రవాణాలో దాదాపు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ జలసంధి ద్వారా వెళ్తుందని గుర్తుచేశారు. అదేవిధంగా సమావేశంలో ట్రంప్, టకైచి ఇంగ్లీష్ మాట్లాడే తీరు పట్ల ప్రశంసలు కురిపించారు. అనువాదం అవసరం లేకుండా మాట్లాడగలగడం చాలా మంచిదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశం ద్వారా అమెరికా-జపాన్ సంబంధాలు, అలాగే ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై ఇరుదేశాల వైఖరి స్పష్టంగా తెలుస్తోంది.