రహస్య పత్రాల కేసులో డొనాల్డ్ ట్రంప్‌పై అభియోగాలు; నేరం రుజువైతే 100ఏళ్ల జైలుశిక్ష
హష్ మనీ చెల్లింపులు, రచయిత జీన్ కారోల్, జెస్సికా లీడ్స్‌పై లైంగిక ఆరోపణలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ షాకిచ్చింది. రహస్య పత్రాల కేసులో ట్రంప్‌పై తాజాగా ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ అభియోగాలు మోపింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడు ఫెడరల్ ఆరోపణలను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. 2024 రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ట్రంప్‌కు రహస్య పత్రాల కేసు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలితే గరిష్టంగా 100 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
రహస్య పత్రాల కేసులో ట్రంప్‌పై మొత్తం ఏడు అభియోగాలు
ట్రంప్ వైట్‌హౌస్‌ను విడిచిపెట్టిన తర్వాత ఫ్లోరిడాలోని తన ఇంటిలో నిలుపుకున్న క్లాసిఫైడ్ ప్రభుత్వ పత్రాలను గుర్తించినట్లు ట్రంప్‌పై ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ అభియోగాలు మోపింది. ట్రంప్ తన వద్ద ఉంచుకున్న రహస్య పత్రాలను దర్వినియోగం చేశారా? లేదా? దానిపై న్యాయ శాఖ 2021లో దర్యాప్తు ప్రారంభించింది. ప్రభుత్వ రహస్య ఫైళ్లను అనధికారికంగా తన దగ్గర ఉంచుకోవడం, తప్పుడు ప్రకటనలు చేయడం, న్యాయాన్ని అడ్డుకోవడానికి కుట్ర చేయడం వంటి ఏడు ఆరోపణలను ట్రంప్ ఎందుర్కొంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడిపై ఇలాంటి అభియోగాలు మోపుతారని తాను ఊహించలేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. బైడెన్ ప్రభుత్వం తనపై బూటకపు అభియోగాలు మోపినట్లు ట్రంప్ 'ట్రూత్ సోషల్'లో పేర్కొన్నారు.