Donald Trump: ట్రంప్‌పై మరో క్రిమినల్ కేసు.. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినట్లు అభియోగాలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరో క్రిమినల్ కేసు నమోదైంది. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ట్రంప్ ప్రయత్నించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలపై విచారించేందుకు యూఎస్ అటార్నీ మెరిక్ గార్లాండ్ జాక్ స్మిత్‌ను ప్రత్యేక న్యాయవాదిగా నియమించారు. జాక్ స్మిత్‌తాజాగా ఫెడరల్ కోర్టులో ట్రంప్‌కు వ్యతిరకేంగా 45పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ట్రంప్ అధికార మార్పిడికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై గురువారం అమెరికా జిల్లా జడ్జి ఎదుట విచారణకు ట్రంప్ హాజరుకానున్నారు. గత నాలుగు నెలల్లో ట్రంప్‌పై నేరారోపణలు నమోదు కావడం ఇది మూడోసారి.
అధ్యక్ష ఎన్నికల ముంగిట ట్రంప్‌కు ఎదురుదెబ్బ
అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తున్నామని పదే పదే చెప్పడం ద్వారా దేశంలో అపనమ్మక వాతావరణాన్ని సృష్టించేందుకు ట్రంప్ ప్రయత్నించారని ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. అలాగే ప్రజలను రెచ్చగొట్టేందుకు, ఎన్నికల నిర్వహణపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఇలాంటి ప్రకటలన చేసినట్లు జాక్ స్మిత్ అభియోగాలు మోపారు. తన వాదనలు అబద్ధమని అతనికి తెలిసినా కూడా, వాటిని వాటిని పునరావృతం చేసి విస్తృతంగా ప్రచారం చేసి, కుట్రపూరతంగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉండాలనుకున్నారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ట్రంప్ రెచ్చగొట్టే మాటల పర్యావసానంగానే జనవరి 6, 2021 న యూఎస్ కాపిటల్ హింస జరిగినట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు. 2024లో అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి విజయం సాధించాలని చూస్తున్న ట్రంప్‌కు ఇది ఎదురుదెబ్బే అని చెప్పాలి.