Donald Trump: ట్రంప్ కార్యవర్గంలో పౌర హక్కుల అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా మరో భారతీయ అమెరికన్‌కు చోటు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టుతున్నారు. ఈ నేపథ్యంలో, భారతీయ అమెరికన్ హర్మీత్ కె. ధిల్లాన్‌ను పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా నియమిస్తూ తన పాలకవర్గానికి ఆహ్వానించారు. ఈ సమాచారాన్ని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌లో సివిల్ రైట్స్ కోసం అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా నామినేట్
''హర్మీత్ కె. ధిల్లాన్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌లో సివిల్ రైట్స్ కోసం అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా నామినేట్ చేయడం గర్వకారణం. ఆమె వృత్తి జీవితంలో పౌర హక్కుల పరిరక్షణ కోసం గొప్ప కృషి చేశారు. కోవిడ్ సమయంలో ప్రార్థనలను అడ్డుకునే చర్యలపై న్యాయపరంగా పోరాడారు. దేశంలో ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరైన ఆమె, ఈ కొత్త పదవిలో రాజ్యాంగ, పౌర హక్కులు, ఎన్నికల చట్టాల అమలు కోసం న్యాయపరమైన మార్గాలను పటిష్ఠంగా చేపడతారని నమ్ముతున్నాను'' అని ట్రంప్ పేర్కొన్నారు.
ఎవరీ హర్మీత్..
హర్మీత్ కె. ధిల్లాన్ చండీగఢ్‌లో జన్మించారు. ఆమె చిన్న వయస్సులోనే కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. లా క్లర్క్‌గా కెరీర్‌ను ప్రారంభించిన హర్మీత్, 2006లో ధిల్లాన్ లా గ్రూప్ అనే సంస్థను స్థాపించారు. గత ఏడాది రిపబ్లికన్ జాతీయ కమిటీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు.