Page Loader
Trump: వాణిజ్య యుద్ధం.. ఇక అన్ని దేశాలకు.. ట్రంప్‌ కీలక ప్రకటన 
వాణిజ్య యుద్ధం.. ఇక అన్ని దేశాలకు.. ట్రంప్‌ కీలక ప్రకటన

Trump: వాణిజ్య యుద్ధం.. ఇక అన్ని దేశాలకు.. ట్రంప్‌ కీలక ప్రకటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2025
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం, చైనాపై ప్రతీకార సుంకాలను (టారిఫ్‌లు) ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి తెస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆయన మరో కీలక ప్రకటన చేశారు. వాణిజ్య యుద్ధం కేవలం 10-15 దేశాలకే పరిమితం కాకుండా, ప్రపంచంలోని అన్ని దేశాలపైనా సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని, అమెరికా తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలంటే ఈ చర్యలు తప్పనిసరిగా అవసరమని వ్యాఖ్యానించారు.

వివరాలు 

 మిత్రదేశాలు కూడా శత్రువుల కంటే దారుణంగా.. 

''చాలా ఏళ్లుగా మేము ప్రపంచదేశాలతో ఉదారంగా వ్యవహరించాము. కానీ, చరిత్రలో ఏ దేశాన్ని దోచుకోనివిధంగా అవి అమెరికాను దోచుకున్నాయి. వాణిజ్య విధానాల విషయంలో కొన్నిసార్లు అమెరికా మిత్రదేశాలు కూడా శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తించాయి. దశాబ్దాలుగా వారు మనపై విధించిన, వివిధ రూపాలలో దోచుకున్న దానికంటే ప్రస్తుతం అమెరికా ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలు చాలా తక్కువ. కాబట్టి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచదేశాలన్నింటిపైనా మా వాణిజ్య టారిఫ్‌లు అమలవుతాయి'' అని ట్రంప్ ప్రకటించారు.

వివరాలు 

దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం

ఏప్రిల్ 2 నుంచి అమలయ్యే ఈ ప్రతీకార సుంకాలను తప్పించుకోవడానికి అమెరికా దిగుమతులపై టారిఫ్ తగ్గింపునకు భారత్ మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలో, రెండు దేశాల మధ్య కొనసాగుతున్న భారత్-అమెరికా వాణిజ్య, టారిఫ్ చర్చల్లో (India-US Tariff Talks) భారత్ ధృఢమైన వైఖరిని ప్రదర్శిస్తోంది. కొన్ని ఉత్పత్తులపై టారిఫ్ తగ్గింపును అంగీకరించినప్పటికీ, దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేసింది. ''సుంకాలు తగ్గించామంటే, అది అమెరికా ఒత్తిడికి లొంగిపోయినట్లు కాదు'' అని ఇటీవల భారత ప్రభుత్వ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

వివరాలు 

 భారత ఉత్పత్తులపై అమెరికా సగటున 2.2% సుంకం 

ఇక, అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతయ్యే ఉత్పత్తులపై ఎంత సుంకాన్ని విధిస్తే, అదే తరహా ఉత్పత్తులపై సమానమైన సుంకాన్ని అమెరికాకు కూడా ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రకారం, భారత ఉత్పత్తులపై అమెరికా సగటున 2.2% సుంకం విధిస్తుండగా, అమెరికా ఉత్పత్తులపై భారత్ సగటుగా 12% సుంకాన్ని విధిస్తోంది.