Donald Trump: ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పోటీ చేయకుండా నిషేధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై డొనాల్డ్ ట్రంప్ సంతకం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారు.
దేశంలోని ట్రాన్స్‌జెండర్‌లు వివిధ పోటీల్లో పాల్గొనకుండా నిషేధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన త్వరలో సంతకం చేయనున్నట్లు సమాచారం.
గత నెలలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనకుండా అడ్డుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆ హామీని కార్యరూపం దాల్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ మహిళా, బాలికల క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉత్తర్వులను జారీ చేయనున్నారు.
ఈ నిర్ణయం మహిళా అథ్లెట్ల హక్కులను రక్షిస్తుందని రిపబ్లికన్ నేత నాన్సీ మేస్ అభిప్రాయపడ్డారు.
అయితే,పలు మానవ హక్కుల సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఇది వివక్షకు దారితీస్తుందని, ట్రాన్స్‌జెండర్ల హక్కులను హరిస్తుందని హెచ్చరిస్తున్నాయి.
వివరాలు
ఇమానె ఖెలిఫ్ వ్యవహారంలో లింగ వివాదం
ట్రాన్స్‌జెండర్ల హక్కుల విషయంలో రిపబ్లికన్ పార్టీ నేతలు గట్టి అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు.
కొన్ని నెలల క్రితం ఒలింపిక్స్ సందర్భంగా అల్జీరియాకు చెందిన ఇమానె ఖెలిఫ్ వ్యవహారంలో లింగ వివాదం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
అప్పట్లో ట్రంప్ కూడా మహిళల క్రీడల్లో పురుషులు పోటీ చేయకుండా చూస్తానని వ్యాఖ్యానించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన డెమోక్రటిక్ సభ్యురాలు, ట్రాన్స్‌జెండర్ సారా మెక్‌బ్రైడ్ విషయంలో కూడా రిపబ్లికన్లు ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టారు, మహిళల బాత్‌రూమ్‌లలోకి ఆమె ప్రవేశాన్ని నిరోధించాలని వారు సూచించారు.