Sri Lanka: శ్రీలంకలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 13,400 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 2 లక్షల మంది భద్రతా సిబ్బందిని నియమించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. 1.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్థిక సంక్షోభం తర్వాత శ్రీలంకలో జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికల్లో తమ తీర్పును నిర్ణయించారు. ఒక్కో ఓటరు ప్రాధాన్యతా క్రమంలో ముగ్గురు అభ్యర్థులకు ఓటు వేసే అవకాశం ఉండగా, 50 శాతం ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.
60శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడి
ఈ ఎన్నికలు 2022లో జరిగిన తీవ్రమైన ఆర్థిక మాంద్యం తర్వాత జరిగే తొలి ఎన్నికలు కావడంతో ప్రజలలో విస్తృత ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 60 శాతం పైగా పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభించామని, ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.