
Elon Musk: ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ.. ట్రెజరీ తాళాలు భారతీయుడి చేతిలో!
ఈ వార్తాకథనం ఏంటి
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇటీవలే తన రాజకీయ ప్రస్థానానికి నాంది పలుకుతూ 'అమెరికా పార్టీ' (America Party - AMEP)ని అధికారికంగా ప్రకటించారు. ఈ నూతన రాజకీయ ప్రయోగంలో భారత మూలాలు కలిగిన టెస్లా ఫైనాన్షియల్ హెడ్ వైభవ్ తనేజా కీలక బాధ్యతలను స్వీకరించడం గమనార్హం. ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ (FEC)కు సమర్పించిన అధికారిక పత్రాల ప్రకారం, ఆయనను అమెరికా పార్టీకి కస్టోడియన్ ఆఫ్ రికార్డ్స్‌గా, అలాగే ట్రెజరర్‌గా మస్క్ నియమించారు. వైభవ్ తనేజా ప్రస్తుతం టెస్లాలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా 2023 ఆగస్టు నుండి టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
Details
టెస్లాలో ఎనిమిదేళ్ల పాటు సేవలు
ఆయన టెస్లా సంస్థలో గత ఎనిమిదేళ్లుగా వివిధ కీలక ఆర్థిక భాద్యతలు చేపడుతూ విశేష అనుభవాన్ని సంపాదించారు. 2019 మార్చి నుంచి చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్ (CAO)గా, 2018 మే నుంచి 2019 మార్చి వరకు కార్పొరేట్ కంట్రోలర్‌గా, 2017 ఫిబ్రవరి నుంచి 2018 మే వరకు అసిస్టెంట్ కార్పొరేట్ కంట్రోలర్‌గా టెస్లాలో ఆయన సేవలందించారు. టెస్లాలో చేరే ముందు ఆయన సోలార్‌సిటీ అనే సంస్థలో ఒక సంవత్సరంపాటు పని చేశారు. అంతకుముందు ప్రఖ్యాత ఆడిటింగ్, కన్సల్టింగ్ కంపెనీ అయిన ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్ (PwC)లో సుదీర్ఘంగా 17 సంవత్సరాలపాటు పనిచేశారు. వైభవ్ తనేజా అమెరికాలో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (CPA), భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెంట్ అర్హతను సైతం కలిగి ఉన్నారు.
Details
టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, బోర్డ్ సభ్యులతో నేరుగా పనిచేసిన అనుభవం
ఆయనకు యుఎస్ GAAP ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఎస్‌ఈసీ కంప్లయిన్స్, రెగ్యులేటరీ ఫైలింగ్స్, ఇంటర్నల్ కంట్రోల్స్, ఆడిట్ మానిటరింగ్ వంటి రంగాల్లో విస్తృతమైన అనుభవం ఉంది. టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, బోర్డ్ సభ్యులతో నేరుగా పని చేయడంలో కూడా ఆయనకు స్పష్టమైన దక్కిన అనుభవం ఉంది. విద్యా రంగంలో ఆయన ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ICAI) నుంచి చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేశారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి సంస్థల అభివృద్ధిలో కూడా ఆయన మస్క్‌తో కలిసి పనిచేశారు. కంపెనీ ఆర్థిక ప్రకటనలు, ఆడిట్లు, కంప్లయిన్స్ సంబంధిత డాక్యుమెంట్ల బాధ్యతల్ని ఆయన సమర్థవంతంగా నిర్వహించారు.
Details
డొనాల్డ్ ట్రంప్ తో విభేదాలు తలెత్తడంతోనే నూతన రాజకీయ పార్టీ
తనేజా రాజకీయ పార్టీ ట్రెజరర్ పదవిలో నియమితులవడాన్ని అనేక విశ్లేషకులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. మస్క్ తన రాజకీయ ప్రయాణంలో వ్యక్తిగతంగా నమ్మకంగా భావించే వృత్తిపరమైన సహచరులను వినియోగిస్తున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఎలాన్ మస్క్ తన పార్టీ స్థాపనకు ప్రధాన కారణంగా అమెరికాలో కొనసాగుతున్న అవినీతి, వృథా ఖర్చులను చెప్పారు. డెమొక్రట్స్, రిపబ్లికన్లు కలిసి దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని ఆరోపించిన మస్క్, తాను ఒక ప్రత్యామ్నాయాన్ని అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తలెత్తిన విభేదాల నేపథ్యంలో, ఈ కొత్త రాజకీయ పావు ప్రారంభమైంది.