Elone Musk-India Visit-Postphoned: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా
టెస్లా(Tesla) అధినేత ఎలాన్ మస్క్(Elone Musk) భారత(India) పర్యటన వాయిదా పడింది. విద్యుత్ కార్ల తయారీ సంస్థకు సంబంధించిన అతి ముఖ్యమైన పనుల కారణంగా తన భారత పర్యటన ఆలస్యమవుతోందని ఎలన్ మస్క్ తన ఎక్స్ ఖాతా వేదికగా శనివారం వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో తన భారత పర్యటన ఉంటుందని కూడా ఆ పోస్టులో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ నెల 21, 22, తేదీలలో ఎలాన్ మస్క్ భారత్ పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటన లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)తో ఆయన భేటీ కావాల్సి ఉంది. అనంతరం ఎలన్ మస్క్, ప్రధాని నరేంద్రమోదీ భారత్లో టెస్లా పెట్టుబడులపై కీలక ప్రకటన చేస్తారని అందరూ ఆసక్తి ఎదురుచూస్తున్నారు.
భారత్ లోకి పెట్టుబడులు రావాలని కోరుకుంటున్నాను: మోదీ
ఈ సమయంలో ఎలన్ మస్క్ తాజా ఎక్స్ పోస్టు ద్వారా భారత పర్యటన వాయిదా పడిందని తెలియగానే ఔత్సాహికులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ ఏడాది భారత పర్యటన ఉంటుందని ఎలాన్ మస్క్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధాని కూడా స్పందిస్తూ ''భారత్ లో పెట్టుబడులు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. తయారీ రంగంలో భారతీయుల స్వేదం ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు. అప్పుడే మన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 2015లో టెస్లా సంస్థను సందర్శించినప్పుడు ఆయన తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని మరీ నాతో సమావేశమయ్యారు. తన ఫ్యాక్టరీ మొత్తాన్ని నాకు చూపించారు. అప్పుడే ఆయన వ్యక్తిత్వం నాకు అర్థమైంది'' అని ప్రధాని చెప్పారు.