America: ఆమె నన్ను శృంగార బానిసగా వాడుకుంది.. US సెనేటర్ పై దావా
అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర సెనేటర్ మేరీ అల్వరాడో గిల్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆమె వద్ద పనిచేసిన ఒక పురుష సిబ్బంది ఆమెపై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఈ విషయంలో ఆమె తనను శృంగార బానిసగా వాడుకుందని ఆరోపిస్తూ, దావా వేశారు. 2022లో సెనేటర్‌గా ఎన్నికైన తర్వాత అల్వరాడో గిల్ ఈ వ్యక్తిని తన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించారు. కొన్ని రోజులు గడవకముందే ఆమె వ్యక్తిగత విషయాలు,లైంగిక జీవితం గురించి మాట్లాడడం మొదలుపెట్టారని,తదుపరి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితుడు పేర్కొన్నారు. అల్వారడో తరచూ అసహజ శృంగారం కోసం డిమాండ్ చేసేవారని, అంగీకారం తెలపనప్పుడు బెదిరింపులకు పాల్పడేవారని ఆరోపించారు.
శాంటాక్లాజ్ కాస్ట్యూమ్ వేసుకోలేదని..
ఈ వేధింపుల కారణంగా తీవ్ర మానసిక, శారీరక వేదనకు గురయ్యానని బాధితుడు వివరించారు. వెన్ను నొప్పి, వినికిడి సమస్యలు తలెత్తాయని చెప్పారు. గతేడాది ఆగస్టులో ఈ వేధింపులను వ్యతిరేకించాక, సెనేటర్ తన ప్రవర్తన బాగోలేదంటూ నోటీసులు జారీ చేశారని చెప్పారు. పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగ భద్రత కోసం ఇంతవరకు ఈ విషయాన్ని బయటపెట్టలేదని, కానీ డిసెంబరులో శాంటాక్లాజ్ కాస్ట్యూమ్ వేసుకోలేదని ఉద్యోగం నుంచి తొలగించారని అన్నారు.
దావా ఆరోపణలను కొట్టేసిన సెనేటర్
వేతన బకాయిలు కూడా చెల్లించలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో పరిహారం కోరుతూ శాక్రామెంటో సుపీరియర్ కోర్టులో దావా వేశారు. దావా ఆరోపణలను సెనేటర్ కొట్టిపారేశారు.ఈ ఆరోపణలు డబ్బు కోసం కావాలని చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం అల్వరాడో గిల్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టిన సంగతి గమనార్హం. ఆమెకు వివాహమై, ఆరుగురు సంతానం ఉన్నారు. దీనిపై కోర్టు విచారణ జరగనుంది.