Europe Heatwave: పట్టాలు కరిగేంత వేడి.. యూరప్‌ను అతలాకుతలం చేస్తున్న హీట్‌వేవ్
ఈ వార్తాకథనం ఏంటి
యూరప్ అంతటా కొనసాగుతున్న తీవ్ర హీట్‌వేవ్ సాధారణ ప్రజాజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రోడ్లు కరిగిపోవడం,రైల్వే పట్టాలు వంకరలు తిరగడం,రవాణా వ్యవస్థలు దెబ్బతినడం వంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదట వెస్ట్రన్ యూరప్‌ను తాకిన ఈ హీట్‌వేవ్ క్రమంగా సెంట్రల్,ఈస్ట్రన్ యూరప్‌కు విస్తరించి అనేక దేశాల్లో కొత్త ఉష్ణోగ్రత రికార్డులను నమోదు చేసింది. డెన్మార్క్‌లో 1874 తర్వాత తొలిసారిగా 37డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. స్విట్జర్లాండ్‌లో 38.8 డిగ్రీలు, చెక్ రిపబ్లిక్‌లో 40.8 డిగ్రీలు నమోదై ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించాయి. యూకేలో జూన్ నెలలోనే 37.3 డిగ్రీల సెల్సియస్ నమోదవడం చారిత్రాత్మకంగా నిలిచింది.
వివరాలు
హీట్‌వేవ్ ప్రభావంతో ఆసుపత్రులపై కూడా తీవ్ర ఒత్తిడి
జర్మనీలో అధిక వేడి ప్రభావంతో ఆటోబాన్ హైవేపై కాంక్రీట్ స్లాబ్స్ పేలిపోవడంతో పలు రహదారులను మూసివేయాల్సి వచ్చింది. ఫ్రాన్స్‌లో రోడ్లు కరిగిపోవడం,విద్యుత్ అంతరాయాలు,రైళ్ల ఆలస్యాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. అణుశక్తి కేంద్రాల్లో కూలింగ్ వ్యవస్థలపై ప్రభావం పడటంతో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించినప్పటికీ, సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని అధికారులు వెల్లడించారు. హీట్‌వేవ్ ప్రభావంతో ఆసుపత్రులపై కూడా తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఫ్రాన్స్‌లో వేలాది మంది వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులను ఆశ్రయించగా, అత్యవసర సేవలను అప్రమత్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజా కార్యక్రమాలను వాయిదా వేశారు. జర్మనీలో ఒక నర్సింగ్ హోమ్‌ను ఖాళీ చేయాల్సి వచ్చింది.అలాగే ఒక వ్యక్తి మరణించిన ఘటనలో వేడే కారణమా అనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాలు
ఇటలీ, యూకేలో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు
ఇటలీ, యూకేలో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు కొనసాగుతున్నాయి. పలు నగరాల్లో ప్రజలు ఎండ నుంచి తప్పించుకునేందుకు చెట్ల నీడలు, పార్కులు, ఫౌంటెన్ల వద్ద గడుపుతున్నారు. ఇదే సమయంలో నదులు, సరస్సుల్లో ఈతకు వెళ్లిన కొందరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా నమోదయ్యాయి. మొత్తంగా ఈ హీట్‌వేవ్ యూరప్ అంతటా ప్రజాజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
వివరాలు
హీట్‌వేవ్‌తో పెరుగుతున్న మరణాలు
ఇటీవలి సంవత్సరాల్లో యూరప్‌లో హీట్‌వేవ్‌ల కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజా అధ్యయనాలు, 2026 జూన్‌లో నమోదైన ఘటనలు ఆందోళనకర పరిస్థితిని సూచిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో మాత్రమే హీట్‌వేవ్ ప్రభావంతో సుమారు వెయ్యికి పైగా అదనపు మరణాలు నమోదైనట్లు అంచనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ప్యారిస్ ప్రాంతంలో మరణాల సంఖ్య వేగంగా పెరిగినట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్, హంగేరీ వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. దీంతో యూరప్ వ్యాప్తంగా లక్షలాది మంది తీవ్ర వేడి ప్రభావానికి గురయ్యారు.
వివరాలు
గత సంవత్సరాల అంచనాలు ఏమంటున్నాయి?
అధ్యయనాల ప్రకారం 2024లో యూరప్‌లో సుమారు 62,775 మంది హీట్‌వేవ్ సంబంధిత కారణాలతో మరణించినట్లు అంచనా. అలాగే 2022-2023 వేసవి కాలాల్లో కూడా లక్షల సంఖ్యలో ప్రజలు వేడి సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయినట్లు పరిశోధనలు వెల్లడించాయి. కొన్ని అధ్యయనాలు ప్రతి ఏడాది యూరప్‌లో వేడి కారణంగా మరణాలు పెరుగుతున్న ధోరణి కొనసాగుతోందని సూచిస్తున్నాయి. ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులు హీట్‌వేవ్ ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారు. అంతేకాకుండా రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గకపోవడం ప్రజల ఆరోగ్యానికి మరింత ప్రమాదకరంగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.