Family In Guinness World Records : ఆ కుటుంబంలో ప్రతి సభ్యునికీ గిన్నిస్ రికార్డు
చైనా దేశంలోని చాంగ్షా నగరంలో నివసించే ఒక భారతీయ తెలుగు కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఈ కుటుంబం గినిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రతీ ఒక్కరి పేరును నమోదు చేసుకుంది. ఇది ప్రపంచంలో ఏకైకమైన కుటుంబంగా రికార్డుకెక్కింది. ఈ కుటుంబంలో ప్రతి వ్యక్తి తన స్వంత రికార్డును సాధించడం గమనార్హం. విజయ్, అతని భార్య కోనతాల జ్యోతీ యోగ రంగంలో అద్భుతమైన రికార్డులు సాధించారు. ప్రత్యేకంగా, గర్భావస్థలో 9వ నెలలో ఉన్నప్పుడు జ్యోతీ కఠినమైన యోగాసనాలు చేసి గినిస్ రికార్డు సాధించారు. ఆమె డెలివరీకి ఐదు రోజుల ముందే ఈ రికార్డు సాధించింది. జ్యోతి మాట్లాడుతూ యోగం గర్భావస్థలో ప్రమాదకరం కాదని, ఇది తల్లి, బిడ్డకు ఎంతో ఉపయోగకరమని చెప్పింది.
అత్యధిక సమయం పాటు యోగ సాధన చేసి రికార్డు
అదేవిధంగా ఆమె అత్యధిక సమయం పాటు యోగ సాధన చేసే రికార్డును కూడా నెలకొల్పారు. తమ కుటుంబం యోగాను ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని విజయ్ అన్నారు. తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి తమకు పెద్ద ప్రేరణ ఇచ్చారని విజయ్ వెల్లడించారు. చిరంజీవి ఇంటికి ఆహ్వానించి, గౌరవించి, మద్దతు ఇచ్చారని చెప్పారు. ఈ కుటుంబం తమ సాధించిన రికార్డులను భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం చేసింది. ప్రధాని మోదీ, ఇంటర్నేషనల్ యోగ డే ద్వారా లక్షల మందికి ప్రేరణ ఇచ్చారని చెప్పుకొచ్చారు.