33 ఏళ్ల లవర్ కోసం రూ.900 కోట్ల వీలునామా రాసిచ్చిన మాజీ ప్రధాని
ప్రియురాలి కోసం ఓ దేశాధినేత ఏకంగా రూ.900 కోట్ల విలువైన ఆస్తిని వీలునామాలో రాశారు. ఇటలీని సుదీర్ఘ కాలం పరిపాలించి తిరుగులేని నేతగా పేరుగాంచిన మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని జూన్ 12న తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు సిల్వియోకు సంబంధించిన ఓ వార్త ఆలస్యంగా వెలుగు చూసింది. వీలునామాను ఇటీవలే మీడియా సమక్షంలో తన వారసులకు చదివి వినిపించారు. ఇందులో భాగంగానే కీలక విషయం బహిర్గతమైంది. తన 33 ఏళ్ల ప్రేయసి కోసం 86 ఏళ్ల సిల్వియో ఏకంగా రూ.900 కోట్లను గిఫ్టుగా రాసిచ్చేశారట. ఈ మేరకు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం ప్రసారం చేసింది.
33 ఏళ్ ఫాసినానితో 86 ఏళ్ల సిల్వియో బెర్లుస్కోని ప్రేమాయణం
33 ఏళ్ల రాజకీయ నాయకురాలు మార్టా ఫాసినాని, రాజకీయ కురవృద్ధుడు సిల్వియో బెర్లుస్కోని ప్రేమించారు. ఈ మేరకు 2020 మార్చిలో వీరి లవ్ స్టోరీ పట్టాలెక్కింది. ఇద్దరి మధ్య 53 ఏళ్ల అంతరం ఉంది. మరోవైపు చట్ట ప్రకారం వీరికి వివాహం కానప్పటికీ ఫాసినాను ఆయన భార్యగానే చెప్పేవారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీలునామాలో ఆమె కోసం 100 మిలియన్ యూరోల (భారత కరెన్సీ ప్రకారం రూ.905 కోట్ల) స్థిర చరాస్తులను పంచి ఇచ్చేశారు. అయితే ఇటలీ పార్లమెంట్ దిగువ ఛాంబర్‌లో 2018 నుంచి ఫాసినా మెంబర్ గా కొనసాగుతున్నారు. సిల్వియో స్థాపించిన ఫోర్జా ఇటాలియా పార్టీలో ఆమె సభ్యురాలిగా ఉండటం విశేషం.
ఇటలీలో మూడో సంపన్నమైన వ్యక్తిగా గుర్తింపు
ఇటలీలో మీడియా అధిపతి, రాజకీయ నేతగా కీర్తిగడించిన సిల్వియో సామ్రాజ్యం విలువ దాదాపు 6 బిలియన్ యూరోలకు పైనే ఉంటుంది. ఈ మేరకు భారత కరెన్సీలో రూ. 54 వేల కోట్లు. దీంతో దేశంలోనే మూడో సంపన్నమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. సిల్వియో చట్టపరంగా ఇద్దరిని వివాహం చేసుకుని మరో ఇద్దరితో డేటింగ్ చేశారు. మొత్తం ఐదుగురు సంతానంలో ప్రస్తుతం వ్యాపారాన్ని పెద్ద కుమార్తె మారినా, పెద్ద కుమారుడు పీర్ సిల్వియో నిర్వహిస్తున్నారు. వీలునామాను ఇటీవలే ఐదుగురు పిల్లలకు సాక్ష్యుల సమక్షంలో చదివి వినిపించారు. ఇటలీకి 3 దఫాలు ప్రధానిగా పనిచేసిన సిల్వియో జీవితంలో ఎన్నో వివాదాస్పద అంశాలున్నాయి. అనేక లైంగిక ఆరోపణలు, అవినీతి కేసులను ఈ మాజీ ప్రధాని ఎదుర్కొనడం గమనార్హం.