Page Loader
Explained: పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ అంటే ఏమిటి? అది ఉక్రెయిన్‌కు ఎలా సహాయపడుతుంది..
పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ అంటే ఏమిటి? అది ఉక్రెయిన్‌కు ఎలా సహాయపడుతుంది..

Explained: పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ అంటే ఏమిటి? అది ఉక్రెయిన్‌కు ఎలా సహాయపడుతుంది..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2025
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక మలుపు ఏర్పడింది. ఉక్రెయిన్‌కు "పేట్రియాట్" ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పంపనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ పేట్రియాట్ వ్యవస్థను అందించేందుకు అవసరమైన వ్యయాన్ని యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ తరపున భరించే అవకాశముందని సమాచారం. అమెరికాకు చెల్లించాల్సిన వ్యయాన్ని చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియన్ వెల్లడించారు. ఈ విషయమై చర్చించేందుకు యుఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్‌ను కలవడానికి వాషింగ్టన్ వెళ్లనున్నారు. రష్యా నుండి ఉక్రెయిన్‌పై జరుగుతున్న వైమానిక దాడులను అడ్డుకునేందుకు పేట్రియాట్ వ్యవస్థను అందించాల్సిందిగా గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికాను కోరుతూ వస్తున్నారు.

వివరాలు 

పేట్రియాట్ వ్యవస్థ అంటే ఏమిటి? 

పేట్రియాట్ అనేది ఒక అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. శత్రు దేశాల నుంచి వచ్చే వైమానిక దాడులు,డ్రోన్ల ముప్పులను గుర్తించి అడ్డుకునే సామర్థ్యం దీని సొంతం. శత్రుదేశాల నుంచి దూసుకొచ్చే మిస్సైళ్లను,విమానాలను,డ్రోన్లను వ్యవస్థత రాడార్ సహాయంతో గుర్తించి,వాటిని ఇంటర్‌సెప్ట్ చేసి నాశనం చేస్తుంది. దీనిని అమెరికాలోని రేథియాన్ టెక్నాలజీస్ సంస్థ అభివృద్ధి చేసింది. భూమి నుంచి గాలిలోకి దూసుకెళ్లే ప్రత్యేకమైన క్షిపణులు ఈ వ్యవస్థలో ఉంటాయి. 1980ల కాలం నుంచి ఈ పేట్రియాట్ వ్యవస్థ యుఎస్ ఆర్మీలో ఉపయోగంలో ఉంది. ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యుత్తమమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలలో దీన్ని ఒకటిగా గుర్తిస్తారు. ఒక సాధారణ పేట్రియాట్ బ్యాటరీలో రాడార్ యూనిట్,కంట్రోల్ సిస్టమ్, పవర్ యూనిట్, లాంచర్లు, సహాయక వాహనాలు ఉంటాయి.

వివరాలు 

ఇది ఎలా పనిచేస్తుంది? 

విమానాలు, బాలిస్టిక్ మిస్సైళ్లు, క్రూయిజ్ మిస్సైళ్లతో సహా శత్రు దేశాల నుంచి వచ్చే ముప్పులను తిప్పికొట్టే సామర్థ్యాన్ని ఈ వ్యవస్థ కలిగి ఉంది. పురాతనంగా ఉన్న PAC-2 ఇంటర్‌సెప్టర్లు లక్ష్యానికి సమీపంలో పేలిపోయే బ్లాస్ట్ ఫ్రాగ్మెంటేషన్ వార్‌హెడ్‌ను కలిగి ఉండేవి. అయితే తాజా పేట్రియాట్ PAC-3 క్షిపణులు నేరుగా లక్ష్యాన్ని ఢీకొడతాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు సరఫరా చేయనున్న వ్యూహాత్మక పేట్రియాట్ సిస్టమ్‌లో PAC-3 CRI ఇంటర్‌సెప్టర్‌లను అందించే అవకాశం ఉంది. 2015లో నాటో వెల్లడించిన సమాచారం ప్రకారం, పేట్రియాట్ సిస్టమ్ రాడార్ పరిధి 150కి.మీ కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే హైపర్‌సోనిక్ ఆయుధాలను తిప్పికొట్టేందుకు ఈ వ్యవస్థ ప్రత్యేకంగా రూపొందించబడినదే కాదని, దీనిని అభివృద్ధి చేసిన సంస్థ కూడా దీనిపై అధికారికంగా వెల్లడించలేదు.

వివరాలు 

ఇది ఎలా పనిచేస్తుంది? 

ప్రపంచవ్యాప్తంగా 19 దేశాలు ఈ పేట్రియాట్ వ్యవస్థను వినియోగిస్తున్నాయి. ఇందులో అమెరికా, జర్మనీ, పోలాండ్, ఉక్రెయిన్, జపాన్, ఖతార్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ వంటి దేశాలు ఉన్నాయి. 2025 జనవరిలో అమెరికా, ఇజ్రాయెల్ నుంచి సుమారుగా 90 పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్‌లను ఉక్రెయిన్‌కు పంపినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఒక పేట్రియాట్ బ్యాటరీ ఖరీదు 1 బిలియన్ డాలర్లకు మించుతుందని అంచనా. ఇందులో పేట్రియాట్ సిస్టమ్‌ కోసం సుమారుగా 400 మిలియన్ డాలర్లు, అందులోని క్షిపణుల కోసం సుమారుగా 690 మిలియన్ డాలర్లు వ్యయం అవుతుందని సమాచారం. ఒక్కో పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ ఖరీదు సుమారుగా 4 మిలియన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉంది.