
Boeing: బోయింగ్ విమానం బాత్రూంలో చిక్కుకున్న ప్రయాణికుడు ..సంస్థపై 3.4 మిలియన్ డాలర్ల భారం
ఈ వార్తాకథనం ఏంటి
వైమానిక రంగంలో ప్రముఖ సంస్థగా పేరుగాంచిన బోయింగ్ (Boeing) తన విమానాలలో తరచూ సాంకేతిక లోపాలు,ఇతర సమస్యలు ఎదుర్కొంటుండటంతో నిత్యం వివాదాల్లో చిక్కుకుంటోంది.
ఇటీవలి కాలంలో కూడా బోయింగ్‌కు మరోసారి తలనొప్పిని కలిగించే సంఘటన చోటుచేసుకుంది.
ఒక బోయింగ్ విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి, టాయిలెట్ (బాత్రూమ్) లోపల నుంచి తలుపు తెరవలేక చిక్కుకుపోయాడు.
అతడు ఎన్ని ప్రయత్నాలు చేసినా తలుపు తెరవలేకపోవడంతో, ఆ విమానం పైలట్లు తక్షణమే దారి మళ్లించాల్సి వచ్చింది.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో, అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది.
వివరాలు
సంస్థకు నోటీసులు జారీ చేసిన FAA
ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని, FAA బోయింగ్ సంస్థకు భారీ షాక్ ఇచ్చింది.
బోయింగ్ పేరిట నమోదు అయ్యిన సుమారు 2612 విమానాల ప్రయాణ యోగ్యతను పరిశీలిస్తూ, సంస్థకు నోటీసులు జారీ చేసింది.
టాయిలెట్ తలుపు పనిచేయకపోవడానికి కారణం, దానిలో ఉన్న గొళ్లెం (లాకింగ్ మెకానిజం) డిజైన్ లోపమని FAA అభిప్రాయపడింది.
ఈ కారణంతోనే ప్రయాణికుడు తలుపు తెరవలేకపోయాడని వెల్లడించింది.
ఇటువంటి ప్రమాదకర పరిస్థితులు మళ్లీ ఏర్పడకుండా ఉండేందుకు, బోయింగ్ తన అన్ని విమానాలలోని బాత్రూమ్ గొళ్లెాలను మార్చాల్సిందేనని FAA స్పష్టం చేసింది.
వివరాలు
ఎయిర్ ఇండియా విమానంలో కూడా ఇలాంటి సంఘటన
దీని వల్ల బోయింగ్ సంస్థపై భారీ ఆర్థిక భారం పడనుంది. తాజా అంచనాల ప్రకారం,FAA సూచనల్ని అమలు చేస్తే బోయింగ్‌కు దాదాపు 3.4మిలియన్ డాలర్ల వ్యయం సంభవించొచ్చని అంచనా.
FAA పేర్కొన్న ప్రకారం,బోయింగ్ వాటాదారులు లేదా సంబంధిత అధికారులు ఈ విషయంలో స్పందించడానికి మే 27వతేదీ వరకు గడువు ఇచ్చింది.
ఇది మాత్రమే కాదు.బాత్రూమ్ సమస్యల కారణంగా విమానాలను మార్గం మార్చడం ఇదే మొదటిసారి కాదు.
గత నెలలో ఎయిర్ ఇండియా కు చెందిన ఓవిమానంలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.
ఆ సమయంలో ఓ ప్రయాణికుడు బాత్రూమ్ లో బ్యాగులు,దుస్తులను ఫ్లష్ చేయడంతో అక్కడి టాయిలెట్లు పని చేయకుండా ఆగిపోయాయి. ఫలితంగా ఆ విమానానికి అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.