USA: అమెరికాలో తగ్గని ద్రవ్యోల్బణం.. వడ్డీ రేట్లు పెంచే యోచనలో ఫెడ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) మరోసారి వడ్డీ రేట్లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో జరగనున్న ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో వడ్డీ రేట్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ అధ్యక్షుడు జాన్ విలియమ్స్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉందని, దాన్ని నియంత్రించేందుకు కఠినమైన ద్రవ్య విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
2026 చివరి నాటికి ద్రవ్యోల్బణం 3.5 శాతం స్థాయికి చేరవచ్చని అంచనా
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న విలియమ్స్ మాట్లాడుతూ.. అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
ఫెడరల్ రిజర్వ్ నిర్దేశించుకున్న రెండు శాతం లక్ష్యానికి ద్రవ్యోల్బణాన్ని తీసుకురావడానికి మరికొంత సమయం పడుతుందని వెల్లడించారు.
2026 చివరి నాటికి ద్రవ్యోల్బణం 3.5 శాతం స్థాయికి చేరవచ్చని అంచనా వేశారు.
అయితే, ఫెడ్ లక్ష్యమైన రెండు శాతానికి ద్రవ్యోల్బణం తగ్గాలంటే 2028 వరకు వేచి చూడాల్సి రావచ్చని అభిప్రాయపడ్డారు.
పరిస్థితులను బట్టి వరుస సమావేశాల్లో కూడా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని తెలిపారు.
అయితే, రేట్ల పెంపుపై ముందుగానే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాబోయే రోజుల్లో అందుబాటులోకి వచ్చే ఆర్థిక గణాంకాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
వివరాలు
నిరుద్యోగిత రేటు వచ్చే ఏడాదికి నాలుగు శాతానికి తగ్గచ్చు
మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం స్థిరంగా, బలంగా కొనసాగుతోందని విలియమ్స్ తెలిపారు.
2026, 2027 సంవత్సరాల్లో దేశ ఆర్థిక వృద్ధి రేటు సుమారు 2.75 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
ప్రస్తుతం 4.1 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు వచ్చే ఏడాదికి నాలుగు శాతానికి తగ్గవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే, అంతర్జాతీయ పరిణామాలు, ఇంధన ధరల్లో మార్పులు, దిగుమతులపై విధిస్తున్న సుంకాలు (టారిఫ్‌లు), భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అమెరికాలో ద్రవ్యోల్బణం పరిస్థితిని ప్రభావితం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
వివరాలు
డిసెంబర్ సమావేశంపైనే అందరి దృష్టి
ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయాలు తీసుకునే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌ఓఎంసీ) తదుపరి సమావేశం డిసెంబర్ 8,9 తేదీల్లో జరగనుంది.
ప్రస్తుతం అమెరికాలో ఫెడ్ ఫండ్స్ వడ్డీ రేటు 3.75శాతం నుంచి 4.00శాతం మధ్య కొనసాగుతోంది.
ఈ సమావేశంలో వడ్డీ రేటును మరో 25బేసిస్ పాయింట్లు (0.25 శాతం)పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇటీవల ఫెడరల్ రిజర్వ్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేస్తూ,కఠిన ద్రవ్య విధానం అవసరమనే అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో జాన్ విలియమ్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
డిసెంబర్ సమావేశంలో ఫెడ్ తీసుకునే నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచ మార్కెట్లపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.