LOADING...
America: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫెడరల్‌ కోర్టు షాక్‌ 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫెడరల్‌ కోర్టు షాక్‌

America: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫెడరల్‌ కోర్టు షాక్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 07, 2025
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రత్యేక అధికారాలతో వరుసగా కార్యనిర్వాహక ఉత్తర్వులను (ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు) జారీ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఫెడరల్‌ కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసేలా ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వులను ఇప్పటికే రెండు ఫెడరల్‌ కోర్టులు నిలిపివేసిన నేపథ్యంలో, గురువారం మరో కోర్టు కూడా అదే విధంగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేస్తే వారికి ఇన్సెంటివ్‌లు ఇచ్చేందుకు ట్రంప్‌ ఇచ్చిన ఉత్తర్వులను కూడా మరో కోర్టు నిలిపివేసింది.

వివరాలు 

22 రాష్ట్రాలు కోర్టులో సవాలు

అమెరికాలో తాత్కాలికంగా నివాసముంటున్న వారికి పుట్టే పిల్లలకు జన్మతః పౌరసత్వం పొందే హక్కును ట్రంప్‌ రద్దు చేశారు. ఈ నిర్ణయానికి రాజ్యాంగంలోని 14వ సవరణను ఆయన కారణంగా పేర్కొన్నారు. అయితే, ఈ ఉత్తర్వులను 22 రాష్ట్రాలు కోర్టులో సవాలు చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు ఫెడరల్‌ జడ్జీలు ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేశారు. తాజాగా, గురువారం సియాటిల్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి జాన్‌ కఫెనార్‌ కూడా ట్రంప్‌ ఉత్తర్వులను నిలిపివేస్తూ తీర్పు వెలువరించారు.

వివరాలు 

ఉద్యోగుల తొలగింపును కోర్టుల్లో సవాలు చేసిన  పలు సంఘాలు 

అదేవిధంగా, "బైఅవుట్‌" అనే పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే కార్యక్రమాన్ని ట్రంప్‌ ప్రారంభించారు. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి గురువారమే తుది గడువుగా పేర్కొన్నారు. అయితే, రాజీనామా చేసేవారికి ఇన్సెంటివ్‌లు అందించాలన్న ట్రంప్‌ ఉత్తర్వులను బోస్టన్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి జార్జి ఒ టూల్‌ జూనియర్‌ తాత్కాలికంగా నిలిపివేశారు. ఉద్యోగుల దరఖాస్తు గడువును సోమవారం వరకు పొడిగించాలని ఆయన ప్రభుత్వం ఆదేశించారు. అదే రోజున తన తుది అభిప్రాయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశారు. ఉద్యోగుల తొలగింపును పలు సంఘాలు కోర్టుల్లో సవాలు చేశాయి.